Tuesday, 23 March 2010

రామభద్ర రఘువీర రవివంశ తిలక



రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ
నామమె కామధేనువు నమో నమో

కౌశల్యానందవర్ధన ఘనదశరధసుత
భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ
రాసికెక్క కోదండ రచన విద్యా గురువ
వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా

మారీచసుబాహు మర్ధన తాటకాంతక
దారుణవీరశేఖర ధర్మపాలక
కారుణ్య రత్నాకర కాకాసుర వరద
సారెకు వేదవిదులు జయవెట్టేరయ్యా

సీతారమణ రాజశేఖర శిరోమణి
భూతలపుటయోధ్యాపుర నిలయా
యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన రాఘవా
ఘాత నీ ప్రతాపమెల్ల కడునిండెనయ్యా

జయ జయ రామ



జయ జయ రామ సమర విజయ రామ
భయహర నిజ భక్త పారీణ రామా

జలధి బంధించిన సౌమిత్రి రామా
సెలవిల్లు విరచిన సీతారామా
అల సుగ్రీవునేలిన అయోధ్య రామా
కలిగి యజ్ఞము కాచె కౌసల్య రామా

అరి రావణాంతక ఆదిత్యకుల రామా
గురు మౌనులను గాచే కోదండరామా
ధర నహల్య పాలిటి దశరధ రామా
హరురాణినుతుల లోకాభి రామా

అతి ప్రతాపముల మాయా మృగాంతక రామా
సుత కుశలవ ప్రియ సుగుణ రామా
వితత మహిమల శ్రీవేంకటాద్రి రామా
మతిలోన బాయని మనువంస రామా

రాముడు రాఘవుడు రవికులుడితడు

Get this widget | Track details | eSnips Social DNA


రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము

అరయపుత్రకామేష్టియందుపరమాన్నమున
పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్యతేజము

చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్యపదము

వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు
పాద్కొనపలికేటి పరమార్ధము
పోదితో శ్రీవేంకటాద్రి పొంచి విజనగరాన
ఆదికి అనాదియైన అర్చావతారము

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger