శ్లో || మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాసస్సతాం గతిః
అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాం పతిః ||
1. మహేస్వాసో = గొప్పది అయిన ధనుస్సు ధరించినవాడు
2. మహీ భర్తా = భూమికి భర్త లేక ఆధారము
3. శ్రీనివాసః = లక్షీదేవికి నివాసమయినవాడు
4. సతాంగతిః = సత్పురుషులకు మార్గము, లక్ష్యము అయినవాడు
5. అనిరుద్ధః = అడ్డగింప శక్యము కానివాడు
6. సురానందః = దేవతల ఆనందమునకు కారకుడు
7. గోవిందః = గోవులకు యజమాని అయినవాడు
8. గోవిదాంపతిః = తేజస్సును లేక జ్ఞానము తెలిసినవారిని రక్షించువాడు
భావము : -
పరమాత్మను , శార్గమను విల్లును ధరించినవానిగా, భూమిని ధరించువానిగా, సృష్టివైభవమే తన నివాసముగా గలవానిగా, సత్పురుషుల మార్గము, గమ్యము తానే అయినవానిగా, అడ్డగింప వీలులేనివానిగా, దేవతలకు ఆనందము కలిగించువానిగా, గోవులకు యజమానిగా, జ్ఞానులకు రక్షకునిగా ధ్యానము చేయుము.
Saturday, 13 June 2009
విష్ణు సహస్ర నామం శ్లో || 20
Posted by Sujata M at 18:36 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
విష్ణు సహస్ర నామం శ్లో || 19
శ్లో || 19
శ్లో || మహా బుద్ధిర్మహా వీర్యో మహాశక్తిర్మహాద్యుతిః
అనిర్దేశ్య వపుశ్రీమానమేయాత్మా మహాద్రిధృత్ ||
1. మహాబుద్ధిః = గొప్ప బుద్ధి కలవాడు
2. మహా వీర్యః = గొప్ప పరాక్రమము కలవాడు
3. మహా శక్తిః = గొప్ప సామర్ధ్యము కలవాడు
4. మహాద్యుతిః = గొప్ప ప్రకాశము కలవాడు
5. అనిర్దేశ్యవపుః = పరిమాణమున కతీతమయినవాడు
6. శ్రీమాన్ = లక్ష్మీదేవితో కూడినవాడు
7. అమేయాత్మా = కొలతలకు మించినవాడు
8. మహాద్రిధృత్ = గొప్ప పర్వతమును పైకెత్తినవాడు
భావము :-
పరమాత్మను - బుద్ధికి ఆధారమైనవానిగా, వీర్యవంతునిగా, శక్తిమంతునిగా, మహా ప్రకాశముగా, ఊహకందని పరిమాణము గలవానిగా లేక పరిమాణము లేనివానిగా, లక్ష్మీదేవికి భర్తగా, కొలతలకు లేక మానములకు అందని వానిగా, మహా పర్వతమును పైకెత్తినవానిగా, ధ్యానము చేయుము.
Posted by Sujata M at 18:28 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
Wednesday, 1 April 2009
విష్ణు సహస్ర నామం శ్లో || 18
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||
1. వేద్యః = తెలియబడవలసినవాడు
2. వైద్యః = వైద్యుడు
3. సదాయోగీ = నిరంతరము యోగిగానుండువాడు
4. వీరహ = వీరులను సంహరించువాడు (యుద్ధమందు)
5. మాధవః = లక్ష్మికి పతియైనవాడు
6. మధుః = తేనెవంటివాడు
7. అతీంద్రియః = ఇంద్రియములను దాటినవాడు, ఇంద్రియములకు గోచరించనివాడు
8. మహామాయః = అన్ని మాయలకు అతీతమయిన మాయ కలవాడు లేక మాయలన్నిటికి కారణమయినవాడు
9. మహోత్సాహః = గొప్ప ఉత్సాహము కలవాడు
10. మహాబలః = గొప్ప బలము గలవాడు
భావము : పరమాత్మను తెలియబడువానిగా, వైద్యునిగా, యోగిగా, వీరునిగా మరియూ వీరులను జయించువానిగా, లక్ష్మీదేవి భర్తగా, మధురమైనవానిగా, ఇంద్రియములకు అతీతమయినవానిగా, మాయల కతీతమయినవానిగా, గొప్ప ఉత్సాహవంతునిగా, గొప్ప బలసంపన్నునిగా, ధ్యానము చేయుము.
Posted by Sujata M at 19:01 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
విష్ణు సహస్ర నామం శ్లో || 17
ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘశ్శుచి రూర్జితః
అతీంద్ర స్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ||
1. ఉపేంద్రః = ఇంద్రునికి తమ్ముడైనవాడు
2. వామనః = పొట్టివాడు
3. ప్రాంశుః = పొడవైనవాడు
4. అమోఘః = వ్యర్ధము కానివాడు
5. శుచిః = నిర్మలమయినవాడు
6. ఊర్జితః = బలమయినవాడు
7. అతీంద్రః = ఇంద్రుని మించినవాడు
8. సంగ్రహః = గ్రహించుట యందు చక్కని సామర్ధ్యము కలవాడు
9. సర్గః = సృష్టి చేయువాడు
10. ధృతాత్మా = ఆత్మను ధరించినవాడు
11. నియమః = నియమింపబడినవాడు
12. యమః = క్రమశిక్షణ గలవాడు
భావము :
పరమాత్మను ఇంద్రుని సోదరునిగను, పొట్టివానిగను, ఉన్నతునిగను, ఇంద్రుని అతిక్రమించువానిగను, చక్కని గ్రహణము కలవానిగను, సృష్టియందలి జీవుని ధరించినవానిగను, నియమము మరియు యమము అనునవి తానేయైనవానిగను, ధ్యానము చేయవలయును.
Posted by Sujata M at 18:54 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
విష్ణు సహస్ర నామం శ్లో || 16
బ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః ||
1. బ్రాజిష్ణుః = దీప్తిమంతుడు
2. భోజనం = భోజనము, ఆహారము
3. భోక్తా = భుజించువాడు
4. సహిష్ణుః = సహనము కలవాడు
5. జగదాదిజః = సృష్టి మొట్టమొదట పుట్టినవాడు
6. అనఘః = పాపము లేనివాడు
7. విజయః = విజయము
8. జేతా = జయించినవాడు
9. విశ్వయోనిః = విశ్వమే పుట్టుక స్థానము కలవాడు
10. పునర్వసుః = కోరినపుడు సంపదలు కలిగించువాడు
భావము :
భగవంతుని దీప్తిమంతునిగను, జీవుల ఆహారము తానేఐనవానిగను, జీవుల ద్వారా ఆహారము స్వీకరించువానిగను, సహనమే తన రూపమయినవానిగను, ప్రపంచమునకు మొట్టమొదట పుట్టినవానిగను, జయించిన వానిగను, విశ్వమునకు పుట్టుక తానే అయినవానిగను, ధ్యానము చేయవలెను.
Posted by Sujata M at 18:45 3 comments
Labels: విష్ణు సహస్ర నామం
విష్ణు సహస్ర నామం శ్లో || 15
లోకాధ్యక్షః సురాధ్యక్షొ ధర్మాధ్యక్షః కృతాకృతః
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రః చతుర్భుజః ||
1. లోకాధ్యక్షః = లోకములను అధిష్టించి యున్నవాడు
2. సురాధ్యక్షః = దేవతలకు అధ్యక్షుడయినవాడు
3. ధర్మాధ్యక్షః = ధర్మమునకు పాలకుడైనవాడు
4. కృతాకృతః = సాధింపబడినది మరియు సాధింపబడనిది
5. చతురాత్మా = నాలుగు విధములుగా వ్యక్తమగువాడు
6. చతుర్వ్యూహః = నాలుగు వ్యూహములు కలవాడు
7. చతుర్దంష్ట్రః = నాలుగు కోరలు కలవాడు
8. చతుర్భుజః = నాలుగు భుజములు కలవాడు
భావము : పరమాత్మను లోకములకు అధ్యక్షునిగను, దేవతలకు అధిపతిగను, ధర్మనునకు నిర్వాహకునిగను, సాధింపబడినది మరియు సాధింపబడవలసినదిగాను, నాలుగు స్థితులుగా వ్యక్తమగువానిగను, నాలుగు వ్యూహములుగా తెలియబడువానిగను, నాలుగు కోరలు గలవానిగను, నాలుగు భుజములు గలవానిగను ధ్యానము చేయుము.
Posted by Sujata M at 18:33 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
విష్ణు సహస్ర నామం శ్లో || 14
సర్వగస్సర్వ విద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేద విత్కవిః ||
1. సర్వగః = అంతటనూ వ్యాపించి యున్నవాడు
2. సర్వవిత్ = సమస్తమూ తెలిసినవాడు
3. భానుః = సూర్యునివలె ప్రకాశించువాడు
4. జనార్ధనః = జనులను కాలముగ భక్షించువాడు
5. వేదః = వేదము
6. వేదవిత్ = వేదము తెలిసినవాడు
7. అవ్యంగః = అవయవలోపము లేనివాడు
8. వేదాంగః = వేదాంగములకధిపతి
9. వేదవిత్ = వేదములను తెలిసినవాడు
10. కవిః = కవి
భావము : పరమాత్మను అంతట వ్యాపించియుండువానిగా, సమస్తమును తెలిసినవానిగ, కిరణములన వెలుగు తానయినవానిగా, విశ్వమందలి సేనలకు నాయకునిగా, జీవులను కాలముగ తనలోనికి స్వీకరించువానిగా, జ్ఞానము తెలియువాడుగను, వేదాంగములు తానే యగుటచే అంగలోపము లేనివానిగ పురాణములను కల్పించు కవిగ, మరియు అందలి పరమార్ధము తెలియబడువానిగను ధ్యానము చేయవలెను.
Posted by Sujata M at 18:18 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
విష్ణు సహస్ర నామం శ్లో || 13
శ్లో || రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ||
1. రుద్రః = రుద్రుడను దేవత, చందస్సుకు అధిదేవత
2. బహుశిరాః = అనేక శిరములు కలవాడు
3. బభ్రుః = అనేకముగా విస్తరించిన రూపములే తనరూపమయినవాడు
4. విశ్వయోనిః = విశ్వమే తన పుట్టుక స్థానమయినవాడు
5. శుచిశ్రవాః = వినుటయందు నిర్మలత కలిగినవాడు
6. అమృతః = మృతి లేనివాడు
7. శాశ్వతః = శాశ్వతమైనవాడు
8. స్థాణుః = కదలికలేనివాడు
9. వరారోహః = ఉత్తమమయిన జన్మ కలవాడు,
10. మహాతపాః = గొప్పతపస్సు కలిగినవాడు లేక తపస్సే తానైనవాడు.
భావము :
పరమాత్మను చందస్సులకధిదేవతగా, అనేక శిరములు కలిగినవానిగా, సృష్టియందలి వర్ణములన్నియు తన రూపమయినవానిగా, విశ్వమునకు పుట్టుకయైనవానిగ, మరియు విశ్వమునందు పుట్టుచున్నవానిగ, మృత్యువులేనివానిగ, శాశ్వతునిగ, చైతన్యము లేనివానిగ, ఉత్తమమయిన పుట్టుక కలవానిగ, గొప్ప తపస్సు చేయువానిగ మరియు తపస్సే తానయిన వానిగా ధ్యానము చేయవలెను.
Posted by Sujata M at 18:08 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
Thursday, 19 March 2009
విష్ణు సహస్ర నామం శ్లో ||12
శ్లో || వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః
అమోఘః పుండరీకాక్షో వృష కర్మా వృషా కృతిః
1. వసుః = సృష్టియందలి సంపద
2. వసుమనాః = సంపదలను కోరు మనస్తత్వము
3. సత్యః = సత్యము లేక ధర్మము
4. సమాత్మా = సామ్యమగు పరమాత్మ
5. సమ్మితః = చక్కగా కొలువబడువాడు
6. సమః = సమత్వము కలిగినటువంటివాడు
7. అమోఘః = వ్యర్థము కానివాడు
8. పుండరీకాక్షః = పద్మము వంటి కన్నులు కలవాడు
9. వృషకర్మా = వర్షము కలిగించువాడు
10. వృషాకృతిః = వర్షమే తానయినవాడు
భావము :
సృష్టి యందలి సంపదగానూ, ఆ సంపదను గోరు మనస్సుగనూ, సత్యముగను, ధర్మముగానూ, సామ్యము గలవానిగను, చక్కగా కొలువబడువానిగనూ, సముడుగనూ, వ్యర్థముకాని వానిగను, పద్మము వంటి కన్నులు కలవానిగనూ, వర్షము కలిగించువాని గనూ, వర్షమే తానయినవానిగనూ ధ్యానము చేయవలెను.
Posted by Sujata M at 19:49 1 comments
Labels: విష్ణు సహస్ర నామం
విష్ణు సహస్ర నామం శ్లో || 11.

శ్లో || అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః
వృషా కపి రమే యాత్మా సర్వయోగ వినిస్సృతః
1. అజః = పుట్టనివాడు
2. సర్వేశ్వరః = అన్నిటికి అధిపతి అయినవాడు
3. సిద్ధః = నెరవేర్చువాడు
4. సిద్ధిః = నెరవేర్పబడినది
5. సర్వాదిః = అన్నిటికిని మొదలుయైనవాడు
6. అచ్యుతః = జారనివాడు
7. వృషా కపిః = వర్షించి మరల గ్రహించువాడు
8. అమేయాత్మా = కొలతల కందని ఆత్మ తత్వము కలవాడు
9. సర్వ యోగ వినిస్సృతః = అన్ని లోకముల యందలి పరిణామము వలన సృష్టిని పుట్టించువాడు
భావము :
పరమాత్మను పుట్టనివానిగనూ, అన్నిటికినీ అధిపతిగనూ, సాధిపబడిన మరియూ సాధించుటయను రెండునూ తానే అయినవాడుగ, అన్నిటికన్నా మొదటగా నున్నవాడుగ, జారిపోవుట లేనివానిగా, వర్షములు కలిగించి మరల నీటిని స్వీకరించువానిగ, కొలత కందని ఆత్మతత్త్వము కలవానిగ, అన్ని లోకముల యందలి సామ్యముగా, సృష్టిని పుట్టించువానిగా, ధ్యానము చేయవలెను.
Posted by Sujata M at 19:37 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
Tuesday, 17 February 2009
విష్ణు సహస్ర నామం శ్లో || 10
శ్లో || సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః
1. సురేశః = దేవతలకు అధిపతి అయినవాడు
2. శరణం = శరణమయినవాడు
3. శర్మ = సహనము
4. విశ్వరేతాః = విశ్వమునకు శుక్రబీజమయినవాడు
5. అహః = పగలు
6. సంవత్సరః = సంవత్సరము
7. వ్యాళః = సర్పము
9. ప్రత్యయః = విశ్వాశము
10. సర్వదర్శనః = సమస్తమును చూచువాడు
భావము :
పరమాత్మ దేవతలకు అధిపతిగను, శరణ్యముగను, సహనముగను అయి వున్నాడు. విశ్వమునకు, బీజము వంటివాడు. జీవుల పుట్టుకకు కారణమయినవాడు. అట్లే దినము, సంవత్సరము, నర్పము వంటి కాలము తానయి వున్నవాడు. విశ్వాశమునకు మూలము మరియు సమస్తమును దర్శింపజేయువాడు.
Posted by Sujata M at 20:42 4 comments
Labels: విష్ణు సహస్ర నామం
విష్ణు సహస్ర నామం శ్లో || 9
శ్లో || ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతి రాత్మవాన్ ||
1. ఈశ్వరః = జీవుని యందున్న పరమాత్మ
2. విక్రమ = విక్రమము కలవాడు
3. ధన్వీ = ధనస్సు కలవాడు
4. మేధావీ = మేధస్సుకు ఆధారభూతుడు
5. విక్రమః = విశేషమయిన క్రమము కలిగినవాడు
6. క్రమః = తరింపజేయువాడు లేదా దాటించువాడు
7. అనుత్తమః = అత్యుత్తముడు
8. దురాధర్షః = భయపెట్టుటకు వీలుకానివాడు
9. కృతజ్ఞః = విశ్వాశము గలవాడు
10. కృతిః = చేయబడినది లేక నెరవేర్పబడినది
11. ఆత్మవాన్ = ఆత్మవంతుడు
భావము :
పరమాత్మను జీవుని యందు గల పరమాత్మగను, పరాక్రమము కలవానిగను, ధనస్సు ధరించినవానిగను, ప్రజ్ఞావంతునిగను, విశేషమయిన క్రమము కల్గినవానిగను, పనులు నెరవేర్చువానిగను, ఆత్మవంతునిగను ధ్యానము చేయుము.
Posted by Sujata M at 20:14 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
Monday, 15 December 2008
విష్ణు సహస్ర నామం శ్లో - 8

శ్లో|| ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్టః ప్రజాపతిః
హిరణ్య గర్భో భూగర్బో మాధవో మధుసూదనః
1. ఈశానః = అందరికన్నా గొప్పవాడైన పరమాత్మ
2. ప్రాణదః = ప్రాణములు ఇచ్చువాడు
3. ప్రాణః = ప్రాణము
4. జేష్ఠః = అందరికన్నా పెద్ద వాడు
5. శ్రేష్టః = అత్యుత్తమమయినవాడు
6. ప్రజాపతిః = పుట్టుకకు కారణమయినవాడు
7. హిరణ్యగర్భః = బంగారపు గ్రుడ్డు
8. భూ గర్భః = భూమి యొక్క కేంద్రము
9. మాధవః = లక్ష్మీదేవి భర్త
10. మధుసూదనః = మధువు అను రాక్షసుని చంపినవాడు
భావము :
పరమాత్మను మిక్కిలి గొప్పవానిగను, ప్రాణము నిచ్చువానిగను మరియు ప్రాణము గను, అందరికన్నా పెద్దవానిగను, ఉత్తమమయిన వానిగను, పుట్టుకకు కారణమయినవాడుగను, బంగారపు గుడ్డు గను, భూమికి కేంద్రము మరియు గర్భము అయినవానిగను, లక్ష్మీదేవి కి భర్త గను, మధువు అను రాక్షసుని సంహరించినవానిగను, ధ్యానము చేయవలెను.
Posted by Sujata M at 20:00 8 comments
Labels: విష్ణు సహస్ర నామం
Monday, 1 December 2008
విష్ణు సహస్ర నామం శ్లో 7

శ్లో|| అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః
ప్రభూత స్త్రి కకుబ్ధామ పవిత్రం మంగళం పరం ||
1. అగ్రాహ్యః = తెలుసుకొన వీలు లేనివాడు
2. శాశ్వతః = శాశ్వతమయినవాడు
3. కృష్ణః = చీకటి యే తన రూపమైనవాడు
4. లోహితాక్షః = ఎఱ్ఱని కన్నులు కలవాడు
5. ప్రతర్ధనః = మార్పు లేక నిలుచువాడు
6. ప్రభూతః = చక్కని రూపముగా ఏర్పడినవాడు
7. త్రికకుప్ = మూడుపేర్లతో తెలియబడువాడు
8. ధామ = వెలుగు మార్గముగా గలవాడు
9. పవిత్రం = నిర్మలమయినవాడు
10. మంగళం = శుభ్రమయినవాడు
11. పరం = పరమమయినవాడు, అత్యుత్తమమయినవాడు
భావము :
పరమాత్మ మన గ్రహణమునకు అతీతమయిన వానిగా, చీకటికవ్వల (ఆవల) నున్నవానిగా ధ్యానము చేయవలెను. ఆయన ఎఱ్ఱని కన్నులు కలిగి, మార్పులకు అతీతముగా నుండువాడు. ఆయన చక్కని రూపముగా ఏర్పడి, మూడు నామములు కలిగినవాడు. వెలుగే తన మార్గమయినవాడు మరియు నిర్మలమయినవాడు, అత్యుత్తమ మంగళ రూపము కలవాడు.
Posted by Sujata M at 21:46 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
విష్ణు సహస్ర నామం శ్లో 6

శ్లో|| అప్రమేయో హృషీకేశః పద్మనాభో మర ప్రభుః
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్టః ధుర్వః ||
1. అప్రమేయః = కొలతలకందని వాడు.
2. హృషీకేశః = హృదయమున కధిపతియైనవాడు
3. పద్మనాభః = నాభియందు పద్మము కలిగినవాడు
4. అమర ప్రభుః = దేవతలకు ప్రభువైనవాడు
5. విశ్వకర్మా = విశ్వమును నిర్మాణము చేయువాడు
6. మనుః = మానవ జాతికి అధిపతియైన మనువు
7. త్వష్టా = రూపములను చెక్కువాడు
8. స్థవిష్ఠః = స్థిరమైన వానిలో మిక్కిలి స్థిరమయినవాడు
9. స్థవిరః = వృద్ధుడు
10. ధృవః = ధ్రువము లేక ఇరుసు వంటివాడు
భావము :
భగవంతుడు కొలతల కతీతమయిన హృదూయమున కధిపతిగా పద్మమే తన నాభిగా తెలియబడువాడు. ఆయన దేవతలకు ప్రభువు. విశ్వమును నిర్మాణము చేసినవాడు, మానవజాతికి అధిపతియైనవాడు, సకల రూపములను చెక్కువాడు, అందరికన్నా, ఎక్కువ వయసు కలవాడు. తానే ధ్రువమై స్థిరముగానున్నవాడు.
Posted by Sujata M at 21:34 1 comments
Labels: విష్ణు సహస్ర నామం
Sunday, 30 November 2008
విష్ణు సహస్ర నామం శ్లో 5

శ్లో|| స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
అనాధి నిధనో ధాతా విధాతా థాతురుత్తమః
1. స్వయంభూః = స్వయముగా అవతరించువాడు
2. శంభుః = శాంతి స్వరూపుడు
3. ఆదిత్యః = అదితికి కుమారుడు
4. పుష్కరాక్షః = కల్వ పువ్వు వంటి కన్నులు కలవాడు
5. మహాస్వనః = గొప్ప ధ్వని కలవాడు
6. అనాది నిధనః = మొదలు చివరలు లేనివాడు
7. ధాతాః = సృష్టికర్త
8. విధాతా = కల్పించువాడు
9. ధాతుః ఉత్తమః = = బ్రహ్మ కన్నా ఉత్తముడైనవాడు
భావము :
పరమాత్మ తనంతట తానే పుట్టుచున్నాడు. శాంతియే తానై వ్యక్తమగుచున్నాడు. అదితి కుమారుడు, కలువ పువ్వుల వంటి కన్నులు కలవాడు, శబ్ద స్వరూపమైనవాడు, మొదలు, తుది లేనివాడు. సృష్టి క్రమమును ఏర్పరచువాడు లేక కల్పించువాడు. తానే సృష్టి కర్తయు, అట్టి సృష్టి కర్తకు పాలకుడు అయి ఉన్నవాడు.
Posted by Sujata M at 19:44 1 comments
Labels: విష్ణు సహస్ర నామం
విష్ణు సహస్ర నామం శ్లో 4

శ్లో||4 సర్వ శ్శర్వ శ్శివ స్థాణు ర్బూతాదిర్నిధిరవ్యయః
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః
1.సర్వ = సమస్తము
2.శర్వ = శివుడు
3.శివ = శుభము కలిగించువాడు
4.స్థాణుః = స్థిరమయిన వాడు
5.భూతాధిః = భూతములకు కారణమైనవాడు
6. నిధిః = దాచబడిన సంపద అయినవాడు లేక అందరిచే సమర్పణమయిన వాడు
7. అవ్యయః = వ్యయమగుట లేని వాడు, లేక నశించుట లేనివాడు
8. సంభవః = పుట్టుక లేక కలిగించుట అనుదానికి అధిపతి అయినవాడు
9. భావనః = భావమును నడిపించువాడు లేక భావనకు గమ్యమయినవాడు
10. భర్తా = పోషించువాడు
11. ప్రభవః = మేల్కొనుటకు లేక వ్యక్తమగుటకు అధిపతి అయినవాడు
12. ప్రభుః = సమర్ధుడు లేక అధిపతి
13. ఈశ్వరః = సృష్టి వైభవమునకు అధిపతి అయినవాడు
భావము :
సమస్తము తాను అయినవాడు, హింసను నశింపచేయువాడు, శుభమును కలిగించువాడు, భూతములకు స్థిరమయిన కారణమయినవాడు, వ్యయము కాని నిధి అయినవాడు, భావమయి పుట్టుకయైనవాడు, భరించువాడు, మేల్కొలుపుటకు సమర్ధుడయినవాడు, అట్లు సృష్టివైభవమునకు కారణమయినవానికి నమస్కారము.
Posted by Sujata M at 10:12 0 comments
Labels: విష్ణు సహస్ర నామం
Friday, 28 November 2008
విష్ణు సహస్ర నామం - శ్లో 3

శ్లో|| యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వరః
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః
1. యోగః = యోగము తానే అయినవాడు
2. యోగవిదాం = యోగులలో
3. నేతా = నాయకుడు
4. ప్రధానః = మూల ప్రకృతి (మాయ)
5. పురుషేశ్వరః = పురుషులకు అధిపతి అయినవాడు
6. నారసింహ వపుః = నరసింహ రూపుడైనవాడు
7. శ్రీమాన్ = లక్ష్మీ దేవి భర్త
8. కేశవః = కేశములు కలవాడు
9. పురుషోత్తమః = ఉత్తమ పురుషుడైన వాడు
భావము : ఆయనే యోగము, యోగులకు నాయకుడై ఉన్నవాడు, మూల ప్రకృతి లేక మాయగా వచ్చినవాడు, పురుషులకు ఈశ్వరుడైన వాడు. నృసింహ రూపముతో వచ్చినవాడు, లక్ష్మీ దేవికి భర్త. లోకములే ఆయన కేశములు. ఉత్తమ పురుషుడను ప్రవృత్తి చే తెలియబడువాడు.
Posted by Sujata M at 22:07 2 comments
Labels: విష్ణు సహస్ర నామం
Monday, 24 November 2008
విష్ణు సహస్ర నామం శ్లో 1

శ్లో || విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః
భూత కృ ద్భూత భృద్బావో భూతాత్మా భూత భావనః
1. విశ్వం = ప్రపంచం
2. విష్ణు = వ్యాపించే గుణం కలిగిన వాడు
3. వషట్కార = ప్రపంచమే తానుగా వసించువాడు
4. భూత = జరిగిపోయినది
5. భవ్య = జరగనున్నది
6. భవత్ = జరుగుచున్నది
7. ప్రభుః = పాలకుడు
8. భూతకృత్ = జీవులను సృష్టించువాడు
9. భూతభృత్ = జీవులను భరించువాడు
10. భూతాత్మా = భూతములకు (జీవులకు) ఆత్మ అయిన వాడు
11. భూత భావనః = జీవులను కల్పన చేయువాడు
భావము : ఈ సృష్టి అంతయు విష్ణువు చే వ్యాప్తి చెంది యున్నది. అతడు విశ్వమంతయు నిండి అందు నివసించి యున్నవాడు. అతడే, జరిగినది, జరగబోవునది మరియు జరుగుచున్నది అను కాలము. అతడు ఈ సృష్టికి పాలకుడు కనుక జీవులకు సృష్టికర్త. అతడు భూతములకు ఆత్మ అయినవాడు. కనుక వానిని భరించి పోషించుచున్నాడు. తన ఉదరమందే జీవులను కల్పించుచున్నాడు.
Posted by Sujata M at 19:35 3 comments
Labels: విష్ణు సహస్ర నామం