Saturday, 27 April 2013

జగడపుఁ జనవుల జాజరజగడపుఁ జనవుల జాజర
సగినల మంచపు జాజర

మొల్లలు దుఱుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమునఁ
జల్లన బుప్పొడి జాఱఁగఁ బతిపై
చల్లే రతివలు జాజర

భారపు కుచముల పైపైఁ గడు సిం-
గారము నెఱపేటి గందవొడి
చేరువ పతిపై చిందఁగఁ బడఁతులు
సారెకు జల్లేరు జాజర

బింకపుఁ గూటమి పెనగేటి చెమటల
పంకపు పూఁతల పరిమళము
వేంకటపతిపై వెలఁదులు నించేరు
సంకుమదంబుల జాజరఒకరిపై ఒకరికి ఉన్న అధికారం వల్ల ప్రేమతో వచ్చే చిలిపి కలహాలతో చెలులు స్వామిమీద రంగులు పోస్తున్నారు. కిర్రు కిర్రు మని చప్పుళ్ళు చేసే కృత్రిమ చెక్క బొమ్మలు ఉన్న మంచముపై స్వామి, చెలులు మంచము మీద కూర్చుని రంగులు పోసుకుంటున్నారు.

చెలులు కొప్పునిండా విస్తారమ్ముగా మొల్ల పూల దండలు పెట్టుకున్నారు. ఆ బరువైన కొప్పులతో మురిసిపోతూ సరసపు ఆటలు మొదలుపెట్టారు. ఒకపక్క ఆ చెలుల అందం, వారు చల్లే చల్లని పుప్పొడి మరియు సుగంధభరితమైన రంగులు శ్రీ వెంకటేశ్వరుని మీద చల్లుతున్నారు.

చెలుల బరువైన స్తనాలమీద పడిన గంధపు పొడి మిక్కిలి అందాన్ని ప్రదర్శిస్తోంది. వేంకటేశునికి దగ్గరగా వచ్చి, చెలులంతా తమ స్తనాలపై మెరుస్తూన్న గంధపుపొడిని జాజర లో కలిపి స్వామి మీద చల్లుతున్నారు.

చెలి, స్వామీ బిగువైన కలయిక (కౌగిలి)లో ఒకరినొకరు మైమరచి గట్టిగా చుట్టుకుంటుంటే ఇద్దరి శరీరాల కలయిక వల్ల పుట్టే వేడి వల్ల, చెమట ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందుగా పూసుకున్న గంధం ఈ చెమట తడితో కలిసి గంధపు బురద గా మారి అద్వితీయమైన వాసన వస్తోంది.  ఆ మనోహర చెమట చెమట వాసనలు కలిగిన జవ్వాజులను, సుగంధద్రవ్యాలను స్వామివారి మీద చెలులు చల్లుతున్నారు. ఆ విధముగా జాజర ఆటలు ఆడుతున్నారు

(జాజు లేదా జాదు అనేవి ఒకే తెలుగు పదానికి రెండు రూపాలు. జాజునే జాజర అని కూడా అనడం ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒకలాగా పలుకుతారు. జాజు అనేది జాజర అనేది ఒక రంగు ఇది ఎర్రరంగు. తెలుగు వార ఇండ్లకు బయటి గోడలకు జాజు రంగు అలదు తారు ఒక పట్టె తెల్ల రంగు మరొక పట్టె జాజును రాస్తారు. ఇది ఇంటికి అందం తెస్తాయి. అయితే జాజర అనే పదం జానపద గేయాలలో ఒక పల్లవిగా ఉంది. ఈ పల్లవితో పాటలున్నాయి. వీటినే జాజర పాటలు అని అంటారు. జాజర జాజర జాజర జాజ, జాజర చేస్తే నీళ్ళు వచ్చే అనే పాటను. కప్పల పెళ్ళి చేసేటప్పుడు పాడతారు. పాండిత్యాన్ని పూర్తిగా పక్కన బెట్టి తను నమ్మిన వైష్ణవ మత ప్రచారాన్ని అట్టడుగు స్థాయి ప్రజలు అందరికీ అందేలాగా చేయడానికి నిబద్ధుడైన అన్నమయ్య ప్రజల పాటలైన జానపద బాణీలు తీసుకొని అటు అధ్యాత్మ కీర్తనలను ఇటు శృంగార కీర్తనలను రాశాడు. ఆయన నిజానికి రాయలేదు. పాటలు కట్టి పాడుకుంటూ పోయాడు. ప్రతి పాటకు తనే రాగాన్ని సూచించాడు. ఆ రాగంలో పాడాడు. అంతే కాదు ఆయన పాడుతూ గజ్జెకట్టి ఆడాడు అని కూడా చెప్పవచ్చు. ఆయన విగ్రహంలో కాళ్ళకు గజ్జలు ఉండడాన్ని చూడవచ్చు. ఇక్కడ ఈ పాటలో ఉన్న జాజర అనే పదాన్ని పాటలో పల్లవిగా వాడడమే కాకుండా చరణం చివరిలో జాజర అని చెప్పి దీనికి ఎర్రరంగు అనే అర్థం ఉండడాన్ని కూడా అన్నమయ్య వాడుకున్నాడు. 

సౌజన్యం : శ్రీమతి జ్యోతి వలబోజు, శ్రీ పెనుకొండ సుబ్బాచారి
ఫోటో : శ్రీ రామకృష్ణ దీక్షితులు

Related Link : : http://subbachary.blogspot.in/2013/04/my-article-on-annmayya-song.html

0 comments:

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger