Friday 11 December 2009

మిన్నక వేసాలు మాని

Get this widget | Track details | eSnips Social DNA

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా
సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా ||

ఆవులు పేయలకు గానఱచీ బిదుకవలె
గోవిందుడయింక మేలుకొనవయ్యా
ఆవలీవలిపడుచులాటలు మరిగి వచ్చి
త్రోవ గాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా ||

వాడల గోపికలెల్లా వచ్చి నిన్నుముద్దాడ
గూడియున్నారిదే మేలుకొనవయ్యా
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము
ఈడకు దెచ్చి పెట్టెనిక మేలుకోవయ్యా ||

పిలిచీ నందగోపుడు పేరు కొనియదె కన్ను -
గోలుకులు విచ్చి (ఇంక) మేలుకొనవయ్య
అలరిన శ్రీ వేంకటాద్రిమీద బాలకృష్ణ
యిల మామాటలు వింటివిక మేలుకోవయ్య ||

అన్నమయ్య పై సంకీర్తన ద్వారా యోగనిద్రలో మునిగియున్న ఆ గోపబాలుని మేలుకొలుపుతున్నారు.

భావము :

నీ ఆటలు, యోగనిద్రా కట్టిపెట్టవయ్యా ! ఆవులు దూడలకు పాలిచ్చువేళ అయినది. అవి అంబారావం చేస్తున్నవి. పాలు పితికే వేళ అయినది. నీ తోటి గోప బాలురందరూ, నీతో ఆటలాడుటకు నీ వాకిట వచ్చి చేరి యున్నారు. గోపికా మణులు నీపై వ్యామోహంతో నిన్ను ముద్దులాడు వచ్చి యున్నారు. నీవు ఆరగించుటకై, నీ తల్లి యశోదమ్మ వాత్సల్యంతో బంగారు గిన్నెలో పెరుగన్నం తెచ్చి నీ చెంత నిలచి యున్నది. మేల్కొనవయ్యా ! గోపరాజైన నీ తండ్రి, నందుడు నిన్ను చేరి పిలుస్తున్నాడు.

నందరాజునకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ. శ్రీకృష్ణునకు అసురులవలన ఎపుడు ఆపద కలుగుతుందో అన్న భయంతో, నందుడు ఎల్లపుడూ చేతిలో వేలాయుధం ధరించి రక్షకుడుగా ఉంటాడట. శేషగిరిలో నెలకొన్న ఓ బాలకృష్ణా ! విశాలమయిన నీ పద్మనయనములను తెరచి మమ్ము కృపతో ఏలుకోవయ్యా !

మిన్నక వేసాలు = అనాయాసముగా వేసే వేషము
పేయల = దూడల
కన్నుకొలుకులు = కంటి చివరులు
అలరించు = ఉదయించు

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger