Wednesday 25 December 2013

బేట్రాయి సామి దేవుడా






NOTE : పై వీడియో లో - కింద ఇచ్చిన పాట లోనూ తేడాలుండొచ్చు. ఎందుకంటే, రాత లో లేని ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని, సాహిత్యం లో ఈ పాటని,  సేకరించి, పాడించిన  ప్రిన్స్ రామ వర్మ కేరళీయుడు. ఆయన వర్క్ షాప్ లో  ఈ పాటను నేర్చుకుంటున్న ఆ పిల్లలంతా కన్నడిగులు !



బేట్రాయి సామి దేవుడా – నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
కాటేమి రాయుడా – కదిరినరసిమ్ముడా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా  ||బేట్రాయి||
శాప కడుపు సేరి పుట్టగా – రాకాసిగాని
కోపామునేసి కొట్టగా
ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ ||బేట్రాయి||
తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ
దేవాసురులెల్లకూడగా
దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు
సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ ||బేట్రాయి||
అందగాదనవుదులేవయా – గోపాల గో
విందా రచ్చించా బేగరావయా
పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి
కిందు మిందు సేసినోద సందమామ నీవె కాద ||బేట్రాయి||
నారసిమ్మ నిన్నె నమ్మితి – నానాటికైన
కోరితి నీ పాదమే గతీ
ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి
కోర మీసవైరిగాని గుండె దొర్లసేసినోడ ||బేట్రాయి||
బుడత బాపనయ్యవైతివి ఆ సక్కురవరితి
నడిగి భూమి నేలుకుంటివే
నిడువు కాల్లోడివై అడుగు నెత్తిపైన బెట్టి
తడవు లేక లోకమెల్ల మెదిమతోటి తొక్కినోడ ||బేట్రాయి||
రెందుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల
సెండాడినావు పరసుతో
సెందకోల బట్టి కోదందరామసామికాడ
బెండు కోల సేసికొనే కొండకాడకేగినోడ ||బేట్రాయి||
రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి
శ్యామసుందర నిన్ను మెచ్చగా
సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి
ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ ||బేట్రాయి||
దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన
దేవుడై నిలిచినావురా
ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగుడుకొనీ
తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ ||బేట్రాయి||
ఏదాలు నమ్మరాదనీ ఆ శాస్త్రాలా
వాదాలూ బాగలేవనీ
బోధనలూ సేసికొనీ బుద్ధులూ సెప్పుకొనీ
నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద ||బేట్రాయి||
కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన
పలికినావు బాలసిసువుడా
చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర
పిల్లంగోవె సేతబట్టి పేట పేట తిరిగినోడ ||బేట్రాయి ||
భావము :-
అనంతపురం జిల్లా కదిరి లో శతాబ్దాల నాటి నరసింహ స్వామి దేవాలయం ఉంది.  ఉగ్ర నరసింహుడు హిరణ్యకసిపుణ్ణి సంహరించాక ఈ ప్రాంతానికే వచ్చాడన్నది స్థానికుల విస్వాసం. అలా ఆగ్రహావేసాలతో వచ్చిన స్వామి ఇక్కడి అడవిలోని క్రూరమృగాలను  వేటాడేవాడని చెబుతారు. అందుకే ఆయనకు వేటరాయుడు అనే పేరు వచ్చింది.  భౌగోళికంగా సమీపంలో ఉన్న కన్నడ భాషా ప్రభావంతో ‘వే’ ‘బే’ అయింది. జన వ్యవహారంలో ఈ బేట్రాయుడు – బేట్రాయి సామిగా మారాడు.
అలాగే ఇదే జిల్లాలో గొడ్డువెలగల అనే గ్రామానికి ఎదర్గా ఉండే గుట్ట మీద మరో నరసింహుడు ఉన్నాడు. ఆయన్ను కాటేమి రాయుడు (కాటమ రాయుడు) అంటారు.  ‘కాడు’ అంతే అడవి. అందులో ఉండే దేవుడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చి వుంటుంది. కదిరి, గొడ్డువెలగల నరసింహులిద్దరిని ఉద్దేశించి  కట్టిన పాట ‘బేట్రాయి సామి దేవుడా ’.  ఇందులో ఒక్కో చరణం, దశావతారాల్లో ఒక్కో అవతారాన్నీ అచ్చ తెలుగు పదాలతో వర్ణిస్తుంది. మాందలిక పదబంధాలతో కీర్తిస్తుంది.
‘చేప’ గా పుట్టి, సోమకాసురుణ్ణి చంపి, వేదాల (బాపనోల్ల సదువులెల్ల) ను తెచ్చి బ్రహ్మ (బెమ్మదేవర)కు ఇచ్చిన మహావిష్ణువును పొగడుతారు మొదటి చరణంలో. ‘ఓపినన్ని నీళ్ళలోన వలసి వేగామె తిరిగి’ అంటే ‘అవసరార్ధం దండిగ ఉన్న నీళ్ళలో వేగంగా ప్రయాణించి’ అని అర్ధం. ‘సావులేని మందు’ అంతే అమృతమే  కదా. దాన్ని దేవతలకు ఇచ్చింది మోహినిఈ అవతారంలోని విష్ణుమూర్తి. నాలుగంటే నాలుగు అచ్చ తెలుగు పదాలతో రెండో చరణం లో  ఈ విషయం చెప్పారు.  క్షీరసాగర మధనం జరుగుతున్నపుడు  కవ్వంగా ఉన్న మంధర పర్వతం కుంగిపోతుంతుంది.  తాబేలుగా మరిన చక్రధారి ఆ కొండ బరువును మోస్తూ క్షీరసాగర మధనాన్ని సాఫీగా  పూర్తి చేయిస్తాడు.
స్వామి ‘పందిలోన సేరే ‘ (వరాహావతారం) సంధర్భంలో ‘అందగాడనవుదులేవయా’ అనడంలో కొంటెతనముంది. ఇక్కడ మరో చక్కటి ఉపమానముంది. అదే ‘సందమామ నీవె కాద’.         చందృడిచ్చే  వెన్నెల చల్లగా ఉంటుంది. అలాగే చల్లగా చూస్తాడంటూ స్వామిని ఆ చందమామతో పోల్చారు.
‘కంబం’ అంటే స్తంభం. ‘కంబానా చేరి ప్రహ్లాదు గాచి..’ స్తంభంలో ఉండి ప్రహ్లాదుణ్ణి రక్షించిన నారసింహుణ్ణి ప్రస్తుతిస్తున్నారు పల్లీయులు. అదే చరణంలో 'వైరిగాని గుండె దొర్లసేసినోడ’ అన్నారు. వైరి అంటే శత్రువు.  ఆతని గుండెను 'దొర్లసేయడ'మంటే ‘బాగా కొట్టారు’ – ఆ పదం మడిలోని మట్టిగడ్డ్లను చితక్కొట్టడానికి వాడే వస్తువును ‘దొర్లమాను' అంటారు. దాన్నించి ఈ పదబంధం  పుట్టిందన్నమాట.
శక్కురవరితి (చక్రవర్తి), బుడత బాపయ్య (వామనుడు). బలిచక్రవర్తిని అడిగి భూమినేలాడు. నిడువాలు అంటే పొడవైన. నిలువు కాళ్ళోడు (పొడవైన కాళ్ళోడు)  అంత పొడవైన కాళ్ళతో వామనుడు అడుగు నెత్తిన పెట్టాడు (ఆకాశంపై మరో అడుగు).  వాస్తవానికి దీనికి బలి తలపై  పాదం పెట్టిన అర్ధం వస్తుంది.  ‘తడవు లేక లోకమెల్ల మెడిమ తోటి తొక్కినోడ’ – అంటే ‘తడవ్ లేక (ఆలశ్యం చెయకుండా), మెడిమ (వెనక పాదం’.  ‘లోకమెల్ల’ – (బలి చక్రవర్తి ‘ధరణీ పతి కాబట్టి లోకాన్ని తొక్కడమంటే చక్రవర్తిని అణగదొక్కడమే. ంఒత్తంగా భూమ్యాకాశాలపై రెండు అడుగులు వేశాక ఆలశ్యం చేయకుండా బలిని వెనుకపాదంతో తొక్కేశాడని అర్ధం.
పరశురాముడు 21 సారులు లోక విహారం చేసి క్షత్రియ వంశాలను సర్వ నాశనం చేశాడు. ఆందుకే ఇక్కడ ‘రెండు పదుల్ అ ఒక్క మారుతో ఆ దొరలనెల్ల్ సెండాడినావు పరశుతో’ అన్నారు. ఇక్కడ పరశు అంటే గoడ్ర గొడ్డలి. రాముడు శివధనుస్సు విరిచినపుడు పరశురాముడు ఆగ్రహిస్తాడు. ఛేతనైతే ఈ విష్ణు చాపాన్ని ఎకుపెట్టమని సవాలు చేస్తాడు. రాముడు ఎక్కు పెడతాడు. పరశురాముడికి ‘విషయం’ అర్ధమవుతుంది. కానీ రామబాణం వృధాపోకూడదు కదా.  మరేమి చేయాలి ? తన తపోశక్తిపై దాన్ని ప్రయోగించమని చెప్పి పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాడు. ‘కోల’ అంటే ‘బాణమ’నే అర్ధం వుంది. తిరుగులెని రామబాణాన్ని ‘బెండు’గా చేసి అంటే ‘బలహీనం'గా చేసి (తపోశక్తిని కొట్టాక అది బలహీనమే కదా) కొండకాడకేగాడు (పర్వతం దగ్గరకు వెళ్ళాడు). 
‘తండ్రి మాటా గాచి .. నాన్న మాటను గౌరవించి అడవికి వెళ్ళావు రామచంద్రా! ఆ తర్వాత (ఆమైన-ఆపైన) లంకనెల్ల దోమగాను సేసినావు. అంటే లంక ను పడగొట్టావు అని అర్ధం. ‘దోమ నాకు’ అని ఒక నిఘంటు పదం ఉంది. దీనర్ధం ‘దోమ తెగులు సోకిన’. ఆ తెగులు వస్తే పంట నాశనమవుతుంది. లంక పరిస్థితి కూడా అలా అయిందని సేద్యం చేసుకునే పల్లె ప్రజలు పాటలో ప్రతీకాత్మకంగా చెప్పారా ?

‘తక్కిడి బిక్కిడి సేయట’ మంటే గందరగోళం సృష్టించడం.  గోపికల వలువలిత్తుకెళ్ళీ కొంటె కన్నయ్య చేసింది అదే కదా. కృష్ణ పరమాత్ముడు ద్వారకలోనే ఉంటాడు, కానీ ఎక్కడెక్కడి కధలనూ తానే నడిపిస్తాడు. ‘తావు బాగా సేసుకొని’ (స్థిరంగా ఉండి) అంటే ఇదే. 
మానవత్వమున్న వాడే మనిషి. మతాల కట్టుబాట్లు ఆ మానవత్వానికి అడ్డం పడుతున్నపుడు ఆ అడ్డుగోడలను బద్దలు కొట్టాలి. బుద్ధుడి బోధనల పరమార్ధమిదే.  ఆయన కూడా విష్ణుమూర్తి అవతారమే నని భావిస్తారు. ఆందుకే ‘ఏదాలూ నమ్మరాదనీ, ఆ శాస్త్రాలూ వాదాలూ బాగా లేవే’ అంటూ చెపూకొచ్చారు. ‘నమ్మరాదు’, ‘బాగాలేవు’ వంటి పదాలతో అరటిపండు వలిచ్నంత సులువుగా భావాన్ని విడమర్చారు.  చివరగా ‘కల్కి ‘ ని తమ దొరగా ప్రకటించారు. ఫిల్లనగ్రోవితో విహరించిన చిన్ని కృష్ణుణ్ణి (సిన్నీ గోపాలుడౌర / పిల్లంగోవి సేతపట్టి పేట పేట తిరిగినోడ) జ్ఞప్తికి తెచ్చుకుంటూ పాటను ముగించారు.
అచ్చ తెలుగు పదాల అంబుధి ఈ పాట. ఈందులో ప్రతి అక్షరంలో మాధవుడి పై మట్టి మనుషుల అభిమానం కనిపిస్తుంది.  ఆంతే కాదు మనసులోని భావాలను బలంగా, అందంగా అభివ్యక్తీకరించగల శక్తీ గోచరిస్తుంది.



శైలి  : పలకల భజన (రచించినదెవరో తెలియదు. జానపద సాహిత్యం) రాయల సీమ (రేనాటి పల్లె
) ప్రాంతానికి చెందినది.
వివరణ : ఆచార్య రాచపాళెం చంద్రశేఖర  రెడ్డి, (తెలుగు వెలుగు – అక్టోబరు 2013 లో ప్రచురించబడింది )

beaTraayi saami deavuDaa – nannealinoaDa
beaTraayi saami deavuDaa
kaaTeami raayuDaa – kadirinarasimmuDaa
meaTaina veaTugaaDa ninnea nammitiraa  ||beaTraayi||
Saapa kadupu seari puTTagaa – raakaasigaani
koapaamuneasi koTTagaa
oapinanni neellaloana valasee veagaame tirigi
baapanoalla saduvulella bemmadeavarakicchinoaDa ||beaTraayi||
taabealai taanu puTTagaa aa neellakaaDa
deavaasurulellakooDagaa
doavasoosi konDakinda dooragaanea silkinapuDu
saavuleani mandulella deavarlakicchinoaDa ||beaTraayi||
andagaadanavuduleavayaa – goapaala goa
vindaa racchincaa beagaraavayaa
pandiloana seari koara panTitoane etti bhoomi
kindu mindu seasinoada sandamaama neeve kaada ||beaTraayi||
naarasimma nenne nammiti – naanaaTikaina
koariti nee paadamea gatee
oari neevu kambaana seari prahlaadu gaachi
koara meesavairigaani gunDe dorlaseasinoaDa ||beaTraayi||
buData baapanayyavaitivi aa sakkuravariti
naDigi bhoomi nealukunTivea
niduvu kaalloaDivai aDugu nettipaina beTTi
tadavu leaka loakamella medimatoaTi tokkinoada ||beaTraayi||
rendupadulu okkamaarutoa aa doralanella
sendaadinaavu parasutoa
sendakoala baTTi koadandaraamasaamikaaDa
benDu koala seasikonea konDakaaDakeaginoaDa ||beaTraayi||
raamadeava racchincaraavayaa seetammatalli
syaamasundara ninnu mecchagaa
saami tanDirmaaTa gaachi preama bhaktinaadarinchi
aameaina lankanella doamagaanu seasinoaDa ||beaTraayi||
deavakeedeavi koDukugaa ee jagamuloana
deavuDai nilichinaavuraa
aavoola meapukonee aaDoaLLaagudukonee
taavubaaga seasukonee takkiDi bikkiDi seasinoaDa ||beaTraayi||
eadaalu nammaraadanee aa saastraalaa
vaadaaloo baagaleavanee
boadhanaloo sasikonee buddhuloo seppukonee
naadaavinoadudaina nallanayya neevekaada ||beaTraayi||
kaliki naa doravu neevegaa ee jagamuloana
palikinaavu baalasisuvuDaa
chillakattu puramuloana sinnee goapaaluDoura
pillangoave seatabaTTi peaTa peaTa tiriginoaDa ||beaTraayi ||
bhaavamu :-
anantapuram jillaa kadiri loa sataabdaala naaTi narasimhasvaami deavaalayam undi.  ugra narasimhuDu hiranyakasipuNNi samharinchaaka ee praantaanikea vacchaaDannadi sthaanikula visvaasam. alaa aagrahaaveasaalatoa vacchina swami ikkaDi aDaviloani krooramrgaalanu veaTaaDeavaaDani chebutaaru. andukea aayanaku veaTaraayudu anea pearu vacchindi.  bhougoalikamgaa sameepamloa unna kannada bhaashaa prabhaavamtoa ‘vea’ ‘bea’ ayindi. jana vyavahaaramloa ee beaTraayudu – beaTraayi saamigaa maaraaDu.
alaagea idea jillaaloa goDDuvelagala anea graamaaniki eduurgaa unDea guTTa meeda maroa narasimhuDu unnaaDu. aayannu kaateami raayuDu (kaatama raayuDu) anTaaru.  ‘kaaDu’ antea aDavi. anduloa undea deavuDu kaabaTTi aayanaku aa pearu vacchi vunTundi. kadiri, goDDuvelagala narasimhuliddarini uddeasinchi kattina paata ‘beaTraayi saami deavudaa’.  induloa okkoa charanam, dasaavataaraalloa okkoa avataaraannee accha telugu padaalatoa varnistundi. maandalika padabandhaalatoa keertisutni.
‘cheapa’ gaa puTTi, soamakaasuruNNi champi, veadaala (baapanoalla saduvulella) nu tecchi brahma (bemmadeavara)ku icchina mahaavishNuvunu pogaDutaaru modati charaNamloa. ‘oapinanni neeLLaloana valasi veagaame tirigi’ anTea ‘avasaraardham danDiga unna neeLLaloa veagamgaa prayaaNinchi’ ani ardham. ‘saavuleani mandu’ antea amrtamea kadaa. daanni deavatalaku icchindi moahiniee avataaramloani vishNumoorti. naalugantea naalugu accha telugu padaalatoa randeoa charanamloa ee vishayam cheppaaru.  ksheerasaagara madhanam jarugutunnapudu kavvamgaa unna madhara parvatam kungipoatuntundi.  taabealugaa marina chakradhaari aa konda baruvunu moastoo ksheerasaagara madhanaanni saafeegaa  poorti cheayistaaDu.
svaami ‘pandiloana searea ‘ (varaahaavataaram) sandharbhamloa ‘andagaaDanavuduleavayaa’ anadamloa konTetanamundi. ikkaDa maroa chakkaTi upamaanamundi. adea ‘sandamaama neeve kaada’.  chadrduDicchea vennnela challagaa unTundi. alaagea challagaa choostaaDanToo svaamini aa chandamaamatoa poalchaaru.
‘kambam’anTea stambham. ‘kambaanaa cheari prahlaadu gaachi..’ stambhamloa unDi prahlaaduNNi rakshinchina naarasimhuNNi prastunstistunnaaru palleeyulu. adea charaNamloa vairigaani gunDe dorlaseasinoaDa’ annaaru. Vairi anTea Satruvu.  Atani gunDenu dorlaseayaDamanTea ‘baagaa koTTaaru’ – aa padam maDiloani maTTigaDDlanu chitakkoTTaDaaniki vaaDea vastuvunu ‘dorlamaanu anTaaru’ daanninchi ee padabahdam puTTindannamaaTa.
Sakkuravariti (chakravarti, buData baapayya (vaamanuDu. Balichakravartini aDigi bhoomjinealaaDu. niDuvaalu anTea poDavaina. Niluvu kaaLLoaDu (poDavaina kaaLLoaDu)  anta poDavaina kaaLLatoa vaamanuDu aDugu nettina peTTaaDu (aakaaSampai maroa aDugu).  Vaastavaaniki deeniki bali talapai  paadam peTTina ardham vastundi.  ‘taDavu leaka loakamella meDima toaTi tokkinoaDa’ – anTea ‘taDav leaka (aalaSyam cheyakunDaa), meDima (veuka paadam’.  ‘loakamella’ – (bali chakravarti ‘dharaNee pati kaabaTTi loakaanni tokkaDamanTea chakravartini aNagadokkaDamea. Mottamgaa bhoomyaakaaSaalapai renDu aDugulu veaSaaka aalaSyam cheayakunDaa balini venukapaadamtoa tokkeaSaaDani ardham.
paraSuraamuDu 21 saarulu loaka vihaaram cheasi kshatriya vamSaalanu sarva naaSanam cheaSaaDu. Andukea ikkaDa ‘renDu padul a okka maarutoa aa doralanell senDaaDinaavu paraSutoa’ annaaru. ikkaDa paraSu anTea gnaDra goDDali. raamuDu Sivadhanussu virichinapuDu paraSuraamuDu aagrahistaaDu. Cheatanaitea ee vishNu chaapaanni ekupeTTamani savaalu cheastaaDu. raamuDu ekku peDataaDu. paraSuraamuDiki ‘vishayam’ ardhamavutundi. Kaanee raamabaaNam vRdhaapoakooDadu kadaa. Maream cheayaali ? tana tapoaSaktipai daanni prayoaginchamani cheppi paraSuraamuDu maheandr parvataaniki veLLipoataaDu. ‘koala’ anTea ‘baaNama’nea ardham vundi. Tiruguleni raamabaaNaanni ‘benDu’gaa cheasi antEa ‘balaheenamgaa cheasi (tapoaSaktini kotTaaka adi balaheenamea kadaa) konDakaaDakeagaaDu (parvatam daggaraku veLLaaD0. 
‘tanDri maaTA gaachi .. naanna maaTanu gouravinchi aDaviki veLLaavu raamachandraa! Aa tarvaata (aamaina-aapaina) lankanella doamagaanu seasinaavu. anTea lanka nu paDagoTTaavu ani ardham. ‘doama naaku’ ani oka nighanTu padam undi. deenardham ‘doama tegulu soakina’. Aa tegulu vastea panTa naaSanamavutundi. Lanka paristhiti kooDaa alaa ayindani seadyam cheasukunea palle prajalu paaTaloa prateekaatmakamgaa cheppaaraa ?
‘takkiDi bikkiDi seayaTa’ manTea gandaragoaLam sRshTinchaDam.  Goapikala valuvalittukeLLI konTe kannayya seasindi adea kadaa. kRshNa paramaatmuDu dvaarakaloanea unTaaDu, laanee ekkaDekkaDi kadhalanoo taanea naDipistaaDu. ‘taavu baagaa seasukoni’ (sthiramgaa unDi) anTea idea. 
maanavatvamunna vaaDea manishi. mataala kaTTubaaTlu aa maanavatvaaniki aDDam paDutunnapuDu aa aDDugoaDalanu baddalu koTTaali. buddhuDi boadhanala paramaardhamidea.  Aayana kooDaa vishNumoorti avataaramea nani bhaavistaaru. Andukea ‘eadaaloo nammaraadanii, aa Saastraaloo vaadaaloo baagaa leavae’ anToo chepuukocchaaaru. ‘nammaraadu’, ‘baagaaleavu’ vanTi padaalatoa araTipanDu valichnanta suluvugaa bahaavaanni viDamarchaaru.  chivaragaaa ‘kalki ‘ ni tama doragaa prakaTinchaaru. Pillanagroavitoa viharinchina chinni krshNuNNi (sinnee goapaaluDoura / pillamgoavi seatapaTTi peaTa peaTa tiriginoaDa) jnaptiki tecchukunToo paaTanu muginchaaru.
accha telugu padaala ambudhi ee paaTa. Induloa prati aksharamloa maadhavuDi pai maTTi manushula abhimaanam kanipistundi.  Antea kaadu manasuloani bhaavaalanu balamgaa, andamgaa abhivyakteekarinchagala Saktee goacharistundi.
Bhajana : palakala bhajana (rachincinadevaroa teliyadu. Jaanapada saahityam) raayala seema (reanaaTi palle paata) praantaaniki chendinadi.
vivaraNa : aachaarya raachapaaLem chandraSeakhara ReDDi, (telugu velugu – akToabaru 2013)

9 comments:

శ్యామలీయం said...

చాలా బాగుంది. నా మంచి టపాల పట్టికలో చేర్చుకున్నాను!
గాయకులు పాడినసాహిత్యానికీ ముద్రితసాహిత్యానికీ చాలా తేడాలున్నాయి. గమనించగలరు. ఐతే ముద్రితమే సరిగా తోస్తున్నది. పాడినచరణాల్లో ప్రాస తప్పింది చాలాచోట్ల మరి.

Sujata M said...

Avunandi. Difference undi. Kani edi correct anedi teliyadu. Edaina bhavam saripoyindani pettanu. Thaks.

Jai Gottimukkala said...

Good folk song, thanks for the lyrics.

Radha Krishna said...

అద్భుతమైన కీర్తనల సమాహారం. కృతజ్ఞతలు. రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ ఎడ్ల రామదాసు గారు వ్రాసినట్లు చెప్పబడింది. ఆయన పేరుమీద ఒక వీధి ఉంది రాజమండ్రిలో. మహా భక్తుడు, ఎన్నో పాటలు వ్రాసినట్లై చెపుతారు. ...... సాయిరాం

Radha Krishna said...

మంచి బ్లాగ్. దీనిని ఆపకుండా, మరిన్ని కీర్తనలను పోస్ట్ చేయండి. శుభమస్తు... సాయిరామ్

Unknown said...

Edi maa tatayya gaaru Sri yadla Ramadasu garu vrasinadhi. Aayana peruna Rajamandri lo oka pranthm , (Ramadasu peta) , Temple kuda vunnadi.

Jyotsna said...

మంగళంపల్లి వారు ఏనాడో పాడారు...వారి శిష్యులే కదా... రామవర్మ గారు

శ్రీను sreenu said...

Great good explanation

prabhakarrao said...

ఈ అమూల్య‌మైన పాట ర‌చించిన‌ది యెడ్ల రామదాసు గారు... ఆయ‌న శిల్పిగా ఊరూరా తిరుగుతూ ర‌చించిన పాట ఇది. ఈ త‌రానికి ఆయ‌నెవ‌రో తెలియ‌దు కానీ ఓ సినిమాలో ఇందులోని ఒక వాక్యం చేర్చ‌డం వ‌ల‌న అంద‌రికీ సుప‌రిచిత‌మైన‌ది. ఈ పాట‌కు రాగం లేదు. అయిన‌నూ విన‌డానికి ఎంత విన‌సొంపుగా ఉందో...

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger