Sunday, 29 June 2008

తాళ్ళపాక అన్నమయ్య పాటలు

కంటి శుక్రవారము గడియ లేడింట ! అంటి అలమేల్మంగా అండ నుండే స్వామిని : : పల్లవి ::

సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి ! కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మ తోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి ! తుమ్మేదమై చాయ తోన నెమ్మది నుండే స్వామిని :: కంటి ::

పచ్చ కప్పురమే నూరి పసిడి గిన్నెల నించి ! తెచ్చి శిరసాదిగా దిగనలగి
అచ్చెరపడి చూడ అందరి కన్నుల కింపై ! నిచ్చేమల్లె పూవు వలె నిటు తానుండే స్వామిని :: కంటి ::

తట్టుపునుగే కూరిచి ! చట్టాలు చేరిచి నిప్పు ! పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగా మేను నిండా పట్టించి దిద్ది ! బిట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని.


[ తిరుమల వెంకటేశ్వరునికి ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమం, అన్నమయ్య నాటికే ఉన్నట్లు ఈ పాట ద్వారా తెలుస్తున్నది. అభిషేక సమయం లో , తాళ్ళపాక వారు దగ్గరుండి, అభిషేకపు పాటలు పాడటం, అభిషేకానంతరం వారికి ఒక అభిషేకపు పన్నీటి చెంబును తాంబూలచందనఆదులను ఇచ్చి సత్కరించడం జరిగేదని, తిరుమజ్జనోత్సవం శాశ్వతంగా జరపడానికి తాళ్ళ పాక వారే స్వామికి అగ్రహారాలను అర్పించారని కీ.శే. ప్రభాకర శాస్త్రి గారు అన్నమాచార్య చరిత్ర పీఠిక లో తెలిపినారు]

కడబెట్టి = కడగ బెట్టి
గోణము = గోచి (బ్రౌన్యము)
కదంబ పొడి = A fragrant powder compounded of various essences
వేష్టువలు = వలువలు
పునుగు = సుగంధ ద్రవ్యం (musk) - పిల్లి నుండీ తీసేది [the gland or bag of musk found in the Civet Cat] (బ్రౌణ్యం)
బిత్తరి స్వామి = నిగ నిగ ప్రకాశించే స్వామి
తట్టు పునుగు = తట్టి ఎత్తిన మేలైన పునుగుఅది శుక్రవారము. ఏడు గంటల కాలము. సంకీర్తనాచార్యుడు స్వామి సన్నిధి ని చేరినాడు. కళలను చిందే అలమేలుమంగా వల్లభుని వేంకటేశ్వరుని దర్శించి నాడు.

స్వామి తిరువాభరణాలు పక్కకు తీసి పెట్టినారు. తిరు మూర్తికి అందంగా గోచీ బిగించి నారు. సుగంధ సురభాలను చల్లే పన్నీట తడసిన వలువలను రొమ్ము, తల, మొల - చుట్టి నారు. వెంకట రమణుడు తుమ్మెద రెక్కల వంటి వన్నె తో ప్రకాశించినాడు.

నూరి పెట్టిన పచ్చ కప్పూరం బంగారు గిన్నెల కెట్టి తల మొదలు పాదాల వరకూ పొందిక గా పూసినారు. నిత్య మల్లె పూవు వలె నిలిచిన స్వామి సౌందర్యం ఆశ్చర్యాన్ని కలిగించింది - అందరి కన్నుల లో వెన్నెలలు నింపినది.

తట్టుపునుగు చట్టాలలో పేర్చి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళాలలో నింపినారు. వేంకటపతి తిరుమేన దట్టంగా పట్టించి సొంపుగా దిద్దినారు.

భక్తుల వేడుకకు భగవంతుడు మురిసినాడు. ఆ అలమేలుమంగావల్లభుడు నిగ నిగ మెరసి నాడు.


(అన్నమయ్య కీర్తన కు శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారి తాత్పర్యం)
- అన్నమాచార్య ప్రాజెక్ట్ - టి టి డి వారి రెలిజియస్ సిరీస్ - 559 నుంచి

0 comments:

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger