Tuesday, 3 November 2009

భావయామి గోపాలబాలం (Translation)

భావయామి గోపాలబాలం మన -
స్యేవితం తత్పదం చింతయేయం సదా ||

కటిఘటిత మేఖలా ఖచితమణిఘంటికా -
పటలనినదేవ విభ్రాజమానం
కుటిల పదఘటిత సంకుల శింజీతేన తం
చటులనటనా సముజ్జ్వల విలాసం ||

నిరత, కర, కలిత నవనీతం బ్రహ్మాది -
సురనికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితమనుపమం హరిం
పరమ పురుషం గోపాల బాలం ||

[ అన్నమయ్య ఆధ్యత్మిక సంకీర్తన ]

తత్పదం = అతని పదములను
కటిఘటితమేఖలా = మొలనున్న త్రాటికి
సదా = ఎల్లప్పుడు
ఖచితమణిఘంటికా = ఉన్న మణిఘంటి యొక్క
పటిలనినదేన = స్పష్టమైన శబ్దముతో
విభ్రాజమానం = ప్రాశించువానిని
కుటిలపదఘటిత = వంకరగా నడచు పదముల యందున్న
చటులనటనాసముజ్జ్వలవిలాసం = ప్రకాశించు నృత్య విలాసము గలవాడు
నిరత కరకలితనవనీతం = ఎల్లప్పుడు చేతియందు వెన్న గలిగి ఉండువాడు
బ్రహ్మాది సురనికరభావనాశోబితపదం = బ్రహ్మాది దేవతలు భావించే పదములు కలవాడు
అనుపమం = అద్వితీయుడైన
హరిం = హరిని
భావయామి = భావించెదను

సత్య జ్ఞానానంద స్వరూపుడును, నిత్య సిద్ధుడును, ఈ సకల చరాచర సృష్టిలో ఉత్తముడును, సాక్షి స్వరూపుడును, అపరిమిత సామర్ధ్యము కలవాడును అయిన శ్రీ కృష్ణభగవానుడు సర్వజనులకు నంతర్యామి స్వరూపుడయి ఉండువాడు. యోగుల చేత ఎల్లప్పుడును ధ్యానింపబడువాడు. ఇతడు సకల జగత్తుకును, సృష్టి స్థితి సంహారకర్త! ఈ మనుష్య లోకమున అందరినీ ఆనందింపజేయుచుండును. నారదుడు మొదలగు మహా యోగుల చేత నిత్యము సేవింపబడువాడు. ఇట్టి శ్రీకృష్ణ భగవానుని మనః పూర్వకంగా సేవిస్తూ తరిస్తున్నాడు అన్నమాచార్యులు. అన్నమాచార్యులవారు వేలకొలది తెలుగు లో సంకీర్తనలను రచించినను, అందులో కొన్ని సంస్కృత సంకీర్తనలు కూడ కలవు. బాలకృష్ణ కిషోరుని 'భావయామి గోపాలబాలం' అనే సంస్కృత సంకీర్తనలో ఇలా వర్ణిస్తున్నాడు.

నడుమ మొల నూలుకు కూర్చబడిన మణి ఘంటల సవ్వడితో ప్రకాశించు వాడును, వివిధ నవ్య నాట్య భంగిమలతో పాదములు తాటించుటతో ఘల్లు, ఘాల్లు మను ధ్వనితో కూడిన ఆబాలగోపాలుని పాద ద్వయాన్ని ఎల్లప్పుడు స్మరిస్తాను. చేతి వెన్నముద్ద గల బాలకృష్ణుని, బ్రహ్మాది దేవతలందరూ భక్తిభావంతో కొలుస్తున్నారు. ఉత్తమ స్థానమయిన (వైకుంఠం) తిరు వేంకటాచలం పై వెలసిన ఆ తిరువేంగళ నాధుడే బాల గోపాలుడు.


By -
Dr.Chelikani Murali Krishna Rao,
'Padakavita pitamahudu Sri Taallapaaka Annamacharya jivita charitra mariyu sankeertanalu'
Available at Visalandhra Book Stores for Rs.150/- only.

Monday, 17 August 2009

సందెకాడ బుట్టినట్టి చాయల పంట

Get this widget | Track details | eSnips Social DNA

సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత..
చందమాయ చూడరమ్మ చందమామ పంట ||

మునుప పాలవెల్లి మొలచి పండిన పంట
నినుపై దేవతలకు నిచ్చ పంట
గొనకొని హరికన్ను గొనచూపుల పంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట ||

వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి జాజరపంట
కలిమి కామిని తోడ కారుకమ్మిన పంట
మలయుచు తమలోని మర్రి మాని పంట ||

విరహుల గుండెలకు వెక్కసమయిన పంట
పరగచుక్కల రాసి భాగ్యము పంట
అరుదై తూరుపుకొండ నారగబండిన పంట
యిరవై శ్రీ వేంకటేశు నింటిలోని పంట ||

Saturday, 13 June 2009

విష్ణు సహస్ర నామం శ్లో || 20

శ్లో || మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాసస్సతాం గతిః
అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాం పతిః ||

1. మహేస్వాసో = గొప్పది అయిన ధనుస్సు ధరించినవాడు
2. మహీ భర్తా = భూమికి భర్త లేక ఆధారము
3. శ్రీనివాసః = లక్షీదేవికి నివాసమయినవాడు
4. సతాంగతిః = సత్పురుషులకు మార్గము, లక్ష్యము అయినవాడు
5. అనిరుద్ధః = అడ్డగింప శక్యము కానివాడు
6. సురానందః = దేవతల ఆనందమునకు కారకుడు
7. గోవిందః = గోవులకు యజమాని అయినవాడు
8. గోవిదాంపతిః = తేజస్సును లేక జ్ఞానము తెలిసినవారిని రక్షించువాడు

భావము : -

పరమాత్మను , శార్గమను విల్లును ధరించినవానిగా, భూమిని ధరించువానిగా, సృష్టివైభవమే తన నివాసముగా గలవానిగా, సత్పురుషుల మార్గము, గమ్యము తానే అయినవానిగా, అడ్డగింప వీలులేనివానిగా, దేవతలకు ఆనందము కలిగించువానిగా, గోవులకు యజమానిగా, జ్ఞానులకు రక్షకునిగా ధ్యానము చేయుము.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger