Friday 5 April 2019

Anurenu



అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము

వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని ఆ రూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము

పాలజలనిధిలోన పవళించేరూపము
కాల సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము

ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము
[04/04, 9:05 pm] +91 99635 50478: అణురేణు పరిపూర్ణమైన రూపము

భావము :

శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

అతి సూక్ష్మమైన అణువులోను, ఇసుకరేణువంత సూక్ష్మమైన రూపములోను పరిపూర్ణంగా నిండియుండు మహత్తర రూపము ఇది. అణిమాది అష్ట సిధ్ధులను ప్రసాదించగలది ఈ అంజనాద్రి మీద వెలసిన రూపము.

1.  ఈ ప్రపంచంలో వేదములను, వేదాంతమును అవపోసన పట్టినవారు ఎటువంటిదో తెలుసుకొనగోరేది ఈ రూపమునే. మొదలు తుది లేని అద్భుతమైన రూపము కూడా ఇదే. యోగేశ్వరులందరు భావించుటకు ప్రయత్నించే రూపము ఇదే. ఇటువైపు వచ్చి ఈ కొనేటిదగ్గర వెలసిన దివ్యమైన రూపము ఇదే.

2.  క్షీరసాగరమున ( ఆదిశేషునిపైన ) పవ్వళించిన సుందర రూపము ఇదే సుమా! కాలము, కాలగతిని తెలిపే సూర్యచంద్రులు, అగ్ని కూడా ఈయన రూపమే. వెంకటాద్రి మీద బంగారము వలె మెరిసిపోతున్న రూపము ఇదిగో. శేషగిరి మీద వెలసిన మూలరూపము ఈ మహానుభావునిదే. ఈ దివ్యరూపాన్ని గ్రహించండి.

3.  బ్రహ్మాదులను సైతము ఆక్రమించగల మూలమైన రూపం ఇదే. చిన్ని మఱ్ఱిఆకు మీద పవ్వళించియున్న చిన్మయ రూపము ఇదే. పరబ్రహ్మ స్వరూపం ఇదే. మమ్మల్నందరినీ ఎంపిక చేసి రక్షించుకున్న శ్రీవేంకటేశ్వరుని దివ్యరూపము ఏడుకొండలవాని రూపము ఇదే. దీనిని భావించి తరించండి.

0 comments:

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger