ఏమొకో చిగురుటధరమున యెడనెడ గస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
1.కలికి చకోరాక్షికి గడకన్నులు కెంపై తోచిన
చెలువం బిప్పుడిదేమో - చింతింపరె చెలులు
నలువున బ్రాణేశ్వరుపై - నాటిన యా కొనచూపులు
నిలువున బెరుకఘ నంటిన - నెత్తురు కాదు గదా
2. పడతికి చనుగవ మెఱుగులు - పై పై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో బ్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగ వేసవి కాలపు - వెన్నెల కాదు గదా
3. ముద్దియ చెక్కుల కెలకుల - ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేవో - వూహింపరె చెలులు
గద్దరి తిరువేంకటపతి - కామినివదనాంబుజమున
అద్దిన సురతపుజెమటల - అందము కాదు గదా
భావము :
అప్ప్పుడే కేళీమందిరము వెడలి వచ్చిన నాయికను చెలికత్తెలు పట్టుకొని పరాచికాలాడుట పదవస్తువు. ఆ నాయిక కనుగొనల అరుణిమ, పయ్యెదచెరగు దాటిన చనుగవ మెరుగులు, చెక్కిళ్ళ జారిన 'ముత్యాల జాలరుల వంటి చెమట బిందువులు - వీనిని చెలులు చింతించి, కనుగొని, ఊహించి, తెలుసుకొనవలసిన అవసరం ఏర్పడింది. భామిని చిగురుటధరం మీద నిండిన కస్తూరికి కారణాలు వెదికితే మిగిలినవన్నీ స్పష్టంగా బోధపడేవే !
ఆ పల్లవాధర అధరం మీద అక్కడక్కడ కస్తూరి నిండినది. అది భామ తన విభునకు వ్రాసిన పత్రిక యట. కలికి కనుగొనలు ఎర్రవారినవి. అవి వింత అందాన్ని సంతరించుకొన్నవి. సతి పతిపై నాటిన కొన చూపులను నిలువుగ పెరికినప్పుడు అంటిన నెత్తురట. పడతికి చనుగవ మెరుగులు పయ్యెదచెరగు మించి వ్యాపించినవి. వేడుకతో ప్రియుడు తనమగువచనుగవపై ఒత్తిన నఖశశిరేఖలు వెదజల్లిన వేశవికాలపు వెన్నెలలట. ఆ ముద్దియచెంపల కిరువైపుల ముత్యాలజాలరుల ఆభరణాలు అమరినట్లైనది. అవి తిరువేంకటపతి కామినిని కౌగిట చేర్చి అద్దిన సురతపు వేళల చెమటల అందమట.
* * *
చిగురుటధరమున = చివురు వలె ఎర్రనైన మృదువైన పెదవియందు
కలికి = మనోజ్ఞమైన స్త్రీ
చకోరాక్షి = చకోరం (గబ్బిలం.. ఎర్రని కళ్ళు) వంటి కనులు కలది.
కెంపై = ఎర్రని
చెలువము = సౌందర్యము
సలుపునన్ = అందంగా, సమర్ధవంతంగా
ఉడుగని = తగ్గని
ముత్యపు జల్లుల చేర్పులు = ముత్యాల జాలరులతో ఏర్పడిన ఆభరణం (ఆడవాళ్ళు చెంపలపై వేలడుతున్నట్టు వేసుకునే జుంకీల వంటివి)
ఒద్దికలాగులు = అనుకూలమైన విధాలు
గద్దరి = దిట్టదనము గల
ఎమొకో... కాదుకదా = రాత్రి నాయికా నాయకులకు సమాగమైనది. ప్రియుడు ప్రియురాలి అధరాలలొ దంతక్స్యతాలు చేసినాడు కాబోలు. ఆ కసికాట్లలో కస్తూరి కప్పినది. (ఆ కస్తూరి తాంబూలంలోనిది కాబోలు) ఎర్రని మృదువైన పెదవి - అక్కడక్కడ అంటిన కస్తూరి - అది భామ విభునికి రాసిన ప్రేమలేఖ వలె ఉన్నది.
తాటాకు మీద ముషీపంకం (సిరా వంటిది)తో లేఖలు వ్రాయటం పరిపాటే. ఇది రాత్రి ప్రేయసీప్రియుల మధ్య జరిగిన ఒడంబడిక లో భామిని భర్తకు వ్రాసి ఇచ్చిన ఆమోదపత్రమైనా కావచ్చు!
కలికి .... కాదు కదా = కలికి కనుగొనల ఎర్రసెరలు సౌందర్య రేఖలే కాదు. అదృష్టరేఖలు కూడ. ఆ కనుగొనల ఎర్రదనాన్ని గూర్చి ఆలోచించి, హేతువును తెలుసుకొనవలసిన అవసరం ఏర్పడింది. ఒడుపుగా ప్రాణేస్వరుపై నాటిన తన కడగంటి చూపులను నిలువుగా లాగినందున అంటిన నెత్తురు అట. చెలువకనుగొనల అరుణిమకు కారణం తెలిసినది.
పడతికి ..... కాదుకదా = ఆ యౌవనవతి బిగిచనుగవకాంతులు పైటచెరగును దాటినవి. ప్రణయ ప్రొద్దులలో వేడుకకు కొదువ లేదు. క్షణ క్షణానికీ అతిశయమే. ప్రియుడు పడతిగురుకుచములపై నఖక్షతములను చేసినాడు. అవి గోటినొక్కుల నెలవంకలు. ఇత వికాసమునకు ఆటంకములెక్కడివి ? అవి వెన్నెలలను వెదజల్లినవి. అది మామూలు వెన్నెలైన సుఖము లేదు. అందుకే వేసవి కాలపు వెన్నెలైనది.
ముద్దియ .... కాదుకదా = ఈ ముగ్ధ చెక్కుటద్దాలలో చెమట బిందువులు వ్యాపించినవి. అవి చెంపల కిరువైపుల వేసుకొన్న ముత్యాల జాలరుల వంటి ఆభరణాలై తోచినవి. అవి సురతపు వేళల చెమట బిందువులు. తిరువేంకటపతి కౌగిట బిగించి, కామిని వదనాంబుజమున అందముగా అద్దినవి.
* * *
Please open the link in a new Tab. Listen to the song..
921. daivamA O daivamA - దైవమా వో దైవమా
-
Youtube Link : Sri Malladi Brothers,
Tune by Sri Malladi Suribabu garu (??)
॥పల్లవి॥ దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా...
1 week ago
7 comments:
హమ్మో హమ్మో ఇట్లాంటి పాటలు వార్నింగుల్లేకుండా ఈ అమాయక ప్రజల మీదకి వదుల్తారా? జాగ్రత్తండోయ్, ఏ తెర చాతున ఏ మోరల్ పోలీసులు తొంగి చూస్తున్నారో? :)
sujaata,
Teeka taatparyam evaridi teesukunnaru? just curious.meere raasivunte andukondi marinta ekkuva abhinandanalu.
kalpana
Great Effort.
Please continue...
annI okE saari chaduvutaamu :)
సుజాత గారూ,
మీ ప్రయత్నం అభినందనీయం. చాలమంది తెలుగు సాహిత్యభిలాషులందరికీ ఒక మంచి వెబ్ సైట్ ఉటంకిస్తున్నాను. అందులో "కీర్తనలు" విభాగం లో అన్నమయ్య కీర్తనలు చాలా ఉన్నాయి.
http://www.andhrabharati.com
కొత్త పాళీ గారు.. అర్ధం తెలిసాక ఈ పాట వినడం ఒక గమ్మత్తైన సుఖాన్నిస్తుంది. ఈ అనుభవాన్ని అందరికీ అందించడానికే ధైర్యం చేసి పోస్ట్ చేసేను. ఎవరన్నా ఏమయినా అంటే తూచ్ చెప్పేసుకుందామనుకున్నాను.
కల్పన - ఇది కామిశెట్టి శ్రీనివాస్ గారి వర్ణన. ఆయనకు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు సహాయం చేసారుట. ఇది నిజానికి ఒక పుస్తకం నుంచీ కాపీ చేస్తున్నాను. కాపీ రైట్ పోలీసులు పట్టుకుంటారేమో అని భయం. కానీ అన్నమయ్య కీర్తనలు అందరివీ కదా అని కొంచెం ధైర్యం.
విరజాజి గారు, ఒ రె మూ నా గారు - థాంక్స్.
సుజాత గారూ, నాకు చాలా ఇష్టమైన కీర్తనల్లో ఇదొకటి.. ఇవాళ అర్ధంతో సహా చూసేసరికి చాలా సంతోషం వేసింది.. ఎందుకైనా మంచిది మీ పోస్టుల్లోనే ఆ పుస్తకం పేరుని ఎక్కడన్నా ఉటంకించండి..
Really appreciate your efforts!!!
great song. అర్థవివరణకు కృ..లు. శోభారాజు గారి గొంతులో ఈ పాట ప్రాణం పోసుకుంది. అలాగే బాలు కూడా ప్రత్యేకించి ఈ పాట చాలా బాగా పాడారు. తిలాంగ్ రాగంలోని పాటవరుసలో మహత్వమేమో. ముఖ్యంగా శోభారాజుగారి గొంతులో శ్రుతి సరళరేఖలా తిన్నగా.
Post a Comment