|
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని
సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మ తోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని ||
పచ్చ కప్పురమె నూఱి పసిడి గిన్నల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరుపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చె మల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని ||
తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేను నిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని ||