Wednesday, 6 October 2010

ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా

ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా -
కేలీ విహార లక్ష్మీ నారసింహా

ప్రళయ మారుత ఘోర భస్త్రికా పూత్కార
లలిత నిశ్వాస డోలా రచనయా
కులశైల కుంభినీ కుముద హిత రవిగగన
చలన విధి నిపుణ నిశ్చల నారసింహా

వివర ఘన వదన దుర్విధ హసన నిష్ఠ్యూత -
లవ దివ్య పరుష లాలా ఘటనయా
వివిధ జంతువ్రాత భువన మగ్నీకరణ
నవనవ ప్రియ గుణార్ణవ నారసింహా

దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రా నల వి
కార స్ఫులింగ సంగ క్రీడయా
వైర దానవ ఘోర వంశ భస్మీకరణ -
కారణ ప్రకట వేంకట నారసింహా
భావము :

హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగులగొట్టినపుడు, అతనిని చంపడానికి బయటికి వచ్చిన నరసింహస్వామి వర్ణన అన్నమయ్య ఈ కీర్తనలో చేస్తున్నాడు.

ఫాలనేత్రాలనల = నీ నుదుట ఉన్న అగ్ని నుండి
ప్రబల = వృద్ధి చెందే
విద్యుల్లతా = మెరుపులతో
కేలీ విహార = ఆటలాడుకునే వాడివి

నిశ్వాస = నిట్టూర్పు
{ఉదయ అస్త హిమ వింధ్య మేరు, త్రికూట, లోకాలోక పర్వతాలు = ఏడు పర్వతాలు}
కింభిని = భూమిని
కుముద హిత = చంద్రుడిని

ఘన వదన = గొప్పదయిన నోటిని
వివర = తెరిచావు
దుర్విధ = దుర్మార్గులను
హనన = అట్టహాసం చేస్తున్నావు
నిష్ఠ్యూత = వేసిన
దంష్ఠా = భయంకరంగా
వికార = వికృతమైన
స్ఫులింగ సంగ క్రీడ = (పళ్ళ మధ్య) నిప్పురవ్వలు స్నేహం చేసుకోవడం


లక్ష్మీ దేవితో కూడిన నరసింహ స్వామీ ! నీ నుదుటనున్న అగ్ని నుండి వృద్ధి పొందే మెరుపులతో ఆటలాడుకొనే వాడివి.

1) నరసింహ స్వామీ ! నీ నిట్టూర్పులో ప్రళయ కాలానికి సంబంధించిన గాలి ఉంది. భయంకరమైన కొలిమి తిత్తిలో నిప్పు రాజేయడానికి ఊదే పూత్కారముంది. నీ నిట్టూర్పు ఉయ్యాలలా మారి ఏడుకుల పర్వతాలను, భూమిని, చంద్రుడిని, సూర్యుడిని, ఆకాశాన్ని ఒక ఊపు ఊపుతోంది. నువ్వు మాత్రం నిశ్చలంగా ఉన్నావు.

2) నరసింహ స్వామీ ! నీ గొప్పాయిన నోటిని తెరిచావు. దుర్మార్గులను చూసి అట్టహాసం చేస్తున్నావు. నీవు వేసిన ఉమ్మి (లాలాజలం) దివ్యమైనది. తీవ్రమైనది. ఆ ఉమ్మితో అనేక జీవ సమూహాలు ఉన్న, లోకాలను నాశనం చేయగల సమర్ధుడివి. నువ్వు ఎప్పటికప్పుడు కొత్త కొత్త గుణాలకు సముద్రం వంటివాడివి.

3) నరసింహ స్వామీ ! మా వేంకటేశ్వరుడివి నువ్వే ! నీ కోర పళ్ళు భయంకరంగా, ధగధగలాడుతూ ప్రకాశిస్తున్నాయి. వికృతమైన శత్రువులైన భయంకర రాక్షస వంసాలను భస్మం చేయటం కోసం పటాపటలాడుతూ ఒరుసుకుంటున్న నీ పళ్ళ మధ్య నిప్పురవ్వల స్నేహం చేస్తున్నయి. వేంకటేశ్వరా ! నువ్వే ఆ నరసింహుడివి.



- శ్రీ (డా.) తాడేపల్లి పతంజలి
సాక్షి ఆదివారం అనుబంధం తేదీ- అక్టోబరు 3, 2010 నుండి

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger