|
శరణు సరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకట నాయకా
కమల ధరుడును కమల మిత్రుడు
కమల శత్రుడు పుత్రుడు / క్రమముతో
మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా
అనిమిషేంద్రులు మునులుదిక్పతు
లమర కిన్నర సిద్ధులు / ఘనతతో రంభాది
కాంతలు కాచినారెచ్చరికయా
ఎన్నగల బ్రహ్లాద ముఖ్యులు నిన్ను
గొలువగ వచ్చిరి / విన్నపము వినవయ్య
తిరుపతి వేంకటాచల నాయకా
భావము :
భజన పద్ధతిలో సాగిన అన్నమయ్య ప్రసిద్ధమైన కీర్తన ఇది !
ఓ వేంకటేశ్వర స్వామీ ! దేవేంద్రుని చేత పొగడ్తలందుకునేవాడా, లక్ష్మీదేవికి ఇష్టమైన వాడా ! రాక్షసుల గర్వాలను పోగొట్టినవాడా ! నిన్ను శరణు కోరుచున్నాను.
1. పద్మాన్ని ధరించిన బ్రహ్మ, పద్మాన్ని వికసింపజేసి, దానికి మిత్రుడైన సూర్యుడు, పద్మాన్ని ముడుచుకుపోయినట్టు చేసిన చంద్రుడు, కుమారస్వామి (పుత్రుడు), క్రమంగా నే సేవ చేయడానికి ఏకాగ్రతతో ఉన్నారు. వాళలాగే నిన్ను శరణు కోరుచున్న నన్ను రక్షించు.
2. రెప్పలు పడని కన్నులు గల దేవతా శ్రేష్ఠులు (అనిమిషేంద్రులు), మునులు, ఇంద్రుడు, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, అనే ఎనిమిది మంది దిక్పాలకులు, దేవతలు, గుర్రపు ముఖం కలిగి, మనుష్య ఆకారం కలిగిన కిన్నరులు, అణిమ మోలైన ఎనిమిది రకాల సిద్ధులు కలిగిన సిద్ధ పురుషులు, రంభ మొదలైన అందమైన అప్సరసలు, నీ సేవ చేయడానికి ఏకాగ్రత తో కాచుకుని ఉన్నారు.
3. పొగిడే (ఎన్నగల) ప్రహ్లాదుడు మొదలైన భక్తాగ్రేసరులు నిన్ను కొలవడానికి వచ్చారు. వేనటేద్రి పర్వతం మీద ఉన్న వేంకటేశ్వరుడా ! మా అందరి మనవి (=విన్నపము) వినవయ్యా ! విని రక్షించవయ్యా !
(వివరణ డాక్టర్ తాడేపల్లి పతంజలి గారిది, సాక్షి Sunday supplement, 14 నవంబర్ సంచిక నుంచి)