Monday, 4 August 2008

ఒకపరికొకపరి

ఒకపరికొకపరి కొయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండే

జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండే

పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరగి సామాసిరి తొలకినట్లుండే

మెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరిసినట్లుండే

ఈ కీర్తనలో వేంకటేశ్వరుని అందాన్ని వర్ణిస్తున్నాడు కవి. అందాన్ని వర్ణించడమే కాదు, ఒక అందాన్ని మరో అందంతో పోలుస్తూ, రెండిటికీ ఒక సంబంధాన్ని ఊహించడం ఇందులో విశేషం.

కళలన్నీ మొహంలోనే మొలకెత్తినట్టుగా ఉండే ఇతన్ని, చూసిన ప్రతిసారీ ఓ కొత్త ఒయ్యారం కనిపిస్తునే ఉంటుంది!

పొరి - మిక్కిలి. మెరుగు - నునుపైన. తట్టుపునుగు - మేలిరకం పునుగు (ఒక సుగంధద్రవ్యం). మోహమదము - మోహం వల్ల పుట్టే స్వేదం. తొరగి - కారి. సామజ సిరి - ఏనుగు మదజలం. తొలకు - కురియు
నున్నని చెక్కులపై పూసిన పునుగు కరిగి రెండువైపులా కారుతోంది. అదెలా ఉందంటే, మోహంవల్ల పుట్టే చెమటలా ఉంది. ఈ ప్రభువు ఏనుగునడకలాంటి అందమైన నడక ఉన్నవాడు కాబట్టి (సామజ వర గమన), ఏనుగ వెళుతూంటే దాన్నుంచి కారే మదజలంలా ఉందిది. పునుగు నల్లగా ఉంటుంది. ఏనుగునుంచి కారే మదజలమూ నల్లగానే కనిపిస్తుంది.

తరచైన - ఘనమైన (thick). మెరుగుబోడి - మెరుపులాంటి శరీరం కలది. ఒంటిమీద ఘనమైన అలంకారాలతో మెరుస్తున్నాడు వేంకటేశుడు. పక్కనే మెరుపుతీగలాంటి అలమేలు మంగమ్మ, ఎలా ఉందంటే, మెరుపు మేఘంతో కూడి వెలిగిపోతున్నట్టుంది. వేంకటేశుడు నల్లనివాడు కదా!

10 comments:

సుజాత said...

సుజాత గారు,
నాకు భలే చిరాగ్గా ఉంది నా మీద!శ్రీనివాసం బ్లాగు మీదా? రెగ్యులర్ గా చూస్తున్నాను, కొన్ని కీర్తనలు కాపీ కూడా చేసుకున్నాను. కానీ కింద ఎవరు పోస్ట్ చేస్తున్నారో చూళ్ళేదంటే నిర్లక్ష్యమా కాదా?

ఈ కీర్తన నాకు చాలా ఇష్టం! విజయవాడ రేడియో లో పొద్దున్నే భక్తి రంజనిలో విన్న ట్యూనే ఇప్పటికీ ఇష్టం! ఇంక వేరే రాగంలో వింటే నచ్చదు. చాలా థాంక్స్! మంచి కీర్తన అంధించారు. వ్యాఖ్యానం రాస్తే ఇంకా బాగుండేదేమో!

sujata said...

అమ్మయ్యో ! థాంక్స్ అండీ.. ఇది ఏదో నా టేస్ట్ కు సంబంధించిన బ్లాగ్. అంతా అక్కడా, ఇక్కడా పుస్తకాల లోంచీ ఎత్తుకొచ్చి పోస్ట్ చేస్తున్నాను. ఎవరికన్నా పాట కావాలంటే దొరుకుతుంది కదా అని.

మీకు నచ్చితే, నాకదే చాలు. ఈ పాట కు వ్యాఖ్యానం అంటే, నా మటుకు నేను చెయ్యలేను. ఎక్కడన్నా సాలిడ్ వ్యాఖ్యానం దొరికితే రాస్తానిక్కడ. లేకపోతే, తప్పులు తడకలు పడతాయి కదా అని భయం.

భైరవభట్ల కామేశ్వర రావు said...

ఈ కీర్తనలో వేంకటేశ్వరుని అందాన్ని వర్ణిస్తున్నాడు కవి. అందాన్ని వర్ణించడమే కాదు, ఒక అందాన్ని మరో అందంతో పోలుస్తూ, రెండిటికీ ఒక సంబంధాన్ని ఊహించడం ఇందులో విశేషం.

"ఒకపరికొకపరి కొయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండే"

కళలన్నీ మొహంలోనే మొలకెత్తినట్టుగా ఉండే ఇతన్ని, చూసిన ప్రతిసారీ ఓ కొత్త ఒయ్యారం కనిపిస్తునే ఉంటుంది!

"జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండే "

జిగి - కాంతి, మొగి - చక్కగా
జగదేకపతి ఒంటిపై చల్లిన కర్పూరపు ధూళి నలుదిక్కులా కాంతి చిందుతోంది. అదెలా ఉందంటే, చంద్రముఖి అయిన లక్ష్మీదేవిని వక్షస్థలం మీద నిలిపాడు గదా, ఆమె చిందుతున్న దట్టమైన వెన్నెలలా ఉంది. కర్పూరం తెల్లగా,చల్లగా ఉంటుంది కాబట్టి అది వెన్నెలలా ఉందని. మరి వెన్నెలెక్కడనుంచి వచ్చిందీ అంటే, వక్షమ్మీద ఉన్న చంద్రునిలాంటి మొహమున్న లక్ష్మీదేవినుంచి అని!

"పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరగి సామజసిరి తొలకినట్లుండే"

పొరి - మిక్కిలి. మెరుగు - నునుపైన. తట్టుపునుగు - మేలిరకం పునుగు (ఒక సుగంధద్రవ్యం). మోహమదము - మోహం వల్ల పుట్టే స్వేదం. తొరగి - కారి. సామజ సిరి - ఏనుగు మదజలం. తొలకు - కురియు
నున్నని చెక్కులపై పూసిన పునుగు కరిగి రెండువైపులా కారుతోంది. అదెలా ఉందంటే, మోహంవల్ల పుట్టే చెమటలా ఉంది. ఈ ప్రభువు ఏనుగునడకలాంటి అందమైన నడక ఉన్నవాడు కాబట్టి (సామజ వర గమన), ఏనుగ వెళుతూంటే దాన్నుంచి కారే మదజలంలా ఉందిది. పునుగు నల్లగా ఉంటుంది. ఏనుగునుంచి కారే మదజలమూ నల్లగానే కనిపిస్తుంది.

"మెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరిసినట్లుండే "

తరచైన - ఘనమైన (thick). మెరుగుబోడి - మెరుపులాంటి శరీరం కలది. ఒంటిమీద ఘనమైన అలంకారాలతో మెరుస్తున్నాడు వేంకటేశుడు. పక్కనే మెరుపుతీగలాంటి అలమేలు మంగమ్మ, ఎలా ఉందంటే, మెరుపు మేఘంతో కూడి వెలిగిపోతున్నట్టుంది. వేంకటేశుడు నల్లనివాడు కదా!

sujata said...

కామేశ్వర రావు గారు

ఎంత మంచి వ్యాఖ్య రాసారండీ.. దీనిని నేను నా పొస్ట్ లోకి కాపీ చేసుకోవచ్చా ? Many thanks.

భైరవభట్ల కామేశ్వర రావు said...

నిరభ్యంతరంగా!

sujata said...

కామేశ్వర రావు గారు - కాపీ చేసుకున్నాను. చాలా థాంక్స్.

ramu said...
This comment has been removed by the author.
ramu said...
This comment has been removed by the author.
ramu said...

ఒక సందేహం అండి, ఈ సంకీర్తన వ్రాసింది ఆన్నమాచర్యులా లేక ఫెద తిరుమలాచర్యులా?

Sujata said...

Ramu garu

peda tirumalacharyulea ! Thanks.

శ్రీనివాసం నమామ్యహం

శ్రీనివాసం - Templates Novo Blogger