Saturday 2 August 2008

ఉగ్గు వెట్టరే వోయమ్మా

ఉగ్గు వెట్టరే వోయమ్మా చెయ్యొగ్గీ నెదె శిశు వోయమ్మా

1. కడుపులోని లోకమ్ములు గదలీ - నొడలూచకురే వోయమ్మా
తొడికెడు పరుగన దొలగ దీయరే - వుడికెడి పాలివి వోయమ్మా

2. చప్పలు పట్టుక - సన్నపు బాలుని - నుప్పర మొత్తకు రోయమ్మా
అప్పుడె సకలము నదిమీనోరనె - వొప్పదు తియ్యరె వోయమ్మా

3. తొయ్యలు లిటు చేతుల నలగించక - వుయ్యలనిడరే వోయమ్మా
కొయ్య మాటలను - కొండల తిమ్మని - నొయ్యన తిట్టకు రోరమ్మా


భావము :

ఇది ఒక కన్న తల్లి ఉత్కంఠ ! ఇది ఒక భక్తుని తపన. ఈ పాటలో యశోదే అన్నమయ్యగా, అన్నమయ్యే యశోదగా కనిపిస్తారు. వాత్సల్యం రసం అయినా కాకపోయినా రసానుభూతిని కలిగించే ఈ పాటలో వాత్సల్య రసస్థాయినే అందుకొన్నది.

గోపభామినులు యశోదాకిషోరుని వదలి క్షణమైనా నిలువలేదు. ఆ బాలుని తలచి, తల లూచి, అనిర్వచనీయమైన అనుభూతినే పొందినారు. కానీ ఏమిటో ? వారికి తీరని అసంతృప్తి. పరమాత్ముని దర్శించీ తరించ లేని జీవాత్మల పరితాపం వారిది ! పరబ్రహ్మను భావించీ అనుభవించలేని ఆవేదన వారిది.

భామలు బాలుని చేరినారు. పరిసరములు గమనించకయే పరవశించి రసలోలువలైనారు. బాలుని బొమ్మ వలే ఆడించినారు. బొంగరం వలే త్రిప్పినారు. యశోద పరుగున చేరి వారిని వారించినది. చిన్ని చేతుల సాచే చిన్ని శిశువుకు ఉగ్గు పెట్టుమన్నది. ఆ ఒయ్యారి భామలు బాలుని చేతులలోనికి తీసుకొని కదపసాగినారు.

'అయ్యో! కడుపులోని లోకాలు కదిలిపోతాయి జాగ్రత్త !' అని యశోద వారిని హెచ్చరించినది.

వేడిపాలను ఎక్కడ తన బాలుడు తాకి ఒలకపోసుకొంటాడో అని బాలుని తొలగదీయుడని వాపోయింది. కాంతలు బాలుని జబ్బలు పట్టుకొని పైకెత్తి బంతులాడ సాగినారు. 'మీరు వానిని పైకెత్తితే బాలుడు సృష్టినంతా చప్పరించి వేస్తాడు సుమా! అన్నది ఆ తల్లి. మగువలు ముద్దు కృష్నుని నలపసాగినారు. కన్నతల్లి సహనం చచ్చిపోయినది. 'ఎందుకమ్మ, చిన్ని బాలుని అంతగా నలపడం ; ఉయ్యాలలో ఉంచండీ అని మందలించినది. వారేవో దుబారాగా మాట్లాడినారు బాలుని గురించి.


'నా బాలుడంటే ఎవరనుకొన్నారే ? సాక్షాత్తూ ఏడుకొండలవాడే : మీ కొయ్య మాటలు మాని వచ్చిన దార్న వెళ్ళండి ' అని కసిరి పంపింది.


భక్తుని హృదయం విచిత్రమైనది. బాలుడంటూనే పరతత్వాన్ని భోధించినాడు.

* * *
చెయ్యొగ్గీనిదె = చెయ్యి చాచెడినిదె, చెయ్యి అగ్గుట

తొడికెడి = తాకెడి, పట్టెడి

సరగున = శీఘ్రమున

చప్పలు = జబ్బలు

ఉప్పరము = ఆకాశం

కొయ్య మాటలు = తేలిక మాటలు

0 comments:

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger