|
మొత్తకురే అమ్మలాల - ముద్దులాడు వీడె
ముత్తెము వలె నున్నాడు - ముద్దులాడు
1. చక్కని యశోద తన్ను సలిగతో మొత్త రాగా
మొక్క బోయీ గాళ్ళకు - ముద్దులాడు
వెక్కసాన రేపల్లె - వెన్నలెల్ల మాపుదాక
ముక్కున వయ్యగ దిన్న - ముద్దు లాడు
2. రువ్వెడి రాళ్ళ దల్లి - రోలదన్ను గట్టెనంట
మువ్వల గంటల తోడి ముద్దు లాడు
నవ్వెడి జెక్కులనిండ - నమ్మిక బాలుని వలె
మువ్వురిలో - నెక్కుడైన ముద్దులాడు
3. వేలసంఖ్యల సతుల - వెంటబెట్టుకొనిరాగా !
మూల జన్ను గుడిచీని ముద్దులాడు
మేలిమి వెంకటగిరి మీద నున్నాడిదె వచ్చి
మూలభూతి దానైన ముద్దులాడు
దుండగీడైన కృష్ణుని ఎవతో కొట్ట్బఒగా మఱొక్క తరిగ వారించుట పద వస్తువు.
ముంగర ముత్తెము వలె ముద్దులు కులిలే చిన్ని కృష్ణుని మొత్తుటకు ఎవరికి మాత్రము చేతులెట్లాడును ?
గొల్ల భామ మరొక్క గొల్లభామకు బాలకృష్ణుని లీలావిలాసాలను వినిపిస్తున్నది. యశోద తన చిన్నికృస్ణుని మొత్త బోయినది (కొట్టబోయినది) వెంటనే ముద్దు కృష్ణుడు తల్లి కాళ్ళకు మొత్త బోయినాడు. బాల కృష్ణుడు సామాన్యుడా ?
అందితే జుట్టు - అందకపోతే కాళ్ళు - కృష్ణునకిది వెన్నతో బెట్టిన విద్య. ఇంకేమున్నది ? గోపెమ్మ కోపము మటు మాయమైనది. కృష్ణునకు అలుసు చిక్కినది. సఖులతో పరిహాసకులతో ఊరిమీదికి బోయి, గొల్ల ల ఇళ్ళను కొల్లగొట్టినాడు. వెన్న ముద్దలు మాపుదాకా ముక్కున కారునట్లు మెక్కినాడు.
గోపకిశోరుని అల్లరి మితిమీరినది. యశోదమ్మ బాలుని దండింపదలచినది. చిన్ని కృష్ణుని రోట గట్టినది. అది అంత తేలికా ? దామోదరునికి కోపమే వచ్చినది. తన్ను రోటికి కట్టిన తల్లిపై రాళ్ళు రువ్వినాడు. తన చిన్ని చేతులకు అందినంత వరకు విసిరినాడు. చిదిమిన పాలు గారు చిన్ని బుగ్గలతో, చిలికిన నవ్వులతో, మొల చిరు మువ్వలతో గోకులమంతా కలియ దిరిగే నందకిశోరుడు బాలుడా ! పరబ్రహ్మ స్వరూపుడు. త్రిమూర్తులలో మేటియైనవాడు.
బాలకృష్ణ కేళీవిలాసాలు చిలికి చిలికి పెద్దవైనవి. యశోదతో ఫిర్యాదు చేయుటకు వ్రజ భామలు కదలి వచ్చినారు. గోకుల మిల్లిల్లు కదలినది. అక్కడి దృశ్యమును చూచి పల్లీబిబ్బోకవతులు ఆశ్చర్య చకితలైనారు. కృష్ణుడు పసిబాలుని వలె ఒక మూలకు ఒదిగి, యశోదాదేవి యొడిలో చేరి పాలు త్రాగుతున్నాడు. ఆ తల్లి కన్నులతో వాత్సల్యాన్ని కురిపిస్తూ, తన తనయుని తల నిమురుతున్నది. ముద్దుగుమ్మలు ఆ ముద్దుల బాలుని చూచి ముసి ముసి నగవులతొ వెనుకకు మరలినారు.
ఆ లీలామానుష విగ్రహుడే నేడు వేంకటగిరిమీద మూలభూతియై నిలచినవాడు.
1 comments:
vivarana chala bagundi, many many thanks :-)
-Sravan
Post a Comment