|
కులుకక నడవరో - కొమ్మలాలా | జలజల రాలీని - జాజులు మాయమ్మకు
ఒయ్యనే మేను గదలీ - నొప్పుగా నడవరో | గయ్యాళి శ్రీ పాదతాకు - కాంతలాలా
పయ్యెద చెఱగు జారీ - భారపుగుబ్బల మీద | అయ్యో చెమరించె మాయమ్మకు నెన్నుదురు
చల్లెడి గందవొడి మై జారీనిలువరో | పల్లకి పట్టిన ముద్దు - బణతులాలా
మెల్లనైన కుందనపు - ముత్యాల కుచ్చులదర | గల్లనుచు గంకణాలు - గదలీ మాయమ్మకు
జమళిముత్యాల తోడి - చమ్మాళిగలిడరో | రమణికి మణుల నారతులెత్తరో
అమరించి కౌగిట - నలమేలుమంగ నిదె | సమగూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు
భావము :
(వేంకటేశ్వర స్వామి పెండ్లి తిరునాళ్ళు మన యన్నమాచార్యుడే తొలుత వెలయించినవాడుగా తోచుచున్నాడు. ఆగమ శాస్త్రమున, వివాహొత్సవము చేయుచున్న మాన్యుడే కన్యాదాత గా వర్తిల్లగు నని కలదట. వేంకటేశ్వరుని అల్లునిగా పొందిన అన్నమయ్య నిజముగా ధన్యుడు. అలమేలుమంగ అన్నమయ్య కన్నుల వెలుగు. తన ఒడలి బడలికలు తీర్చి కడుపార ప్రసాదాన్నములు పెట్టి హృదయంలో గానకవితానుధారసధారలు కురిపించిన అమృతమయి అలమేలుమంగను అన్నముడు మరచుటెట్లు ? అలమేలు మంగను వాక్ప్రసూనాలతో అర్చించి, ఈ భక్తుడు శతకమాలికను సమర్పించినాడు)
ఈ పాటలో అన్నమయ్య అలమేలుమంగను నవవధువుగా సింగారించి, పల్లకిలో కళ్యాణ వేదిక కు తరలించినట్లు భావించవచ్చు.
కొత్త పెళ్ళికూతురు పల్లకీ లో కూర్చున్నది. కుసుమకోమలి కూర్చున్న పల్లకీని బిరుసు బోయీలు మోయుటను ఈ మృదు హృదయుడు సహింపలేకపోయినాడు కాబోలు ! పల్లకీ మోతకు ముద్దు పణతులను నియోగించినాడు. వాళ్ళు మంగమ్మ పాదదాసీలు. పల్లకీ కళ్యాణవేదిక వైపు సాగింది. పల్లకీపట్టిన మిసిమిగత్తెలు విసవిస నడచినారు. పల్లకీ కుదుపులకు కలిమిజవరాలు కంపించిపోయినది. అమె నెరులు చెదరినవి - విరులు జలజల రాలినవి. రాలిన జాజులను చూచిన అన్నమయ్య శరీరమే జలదరించినది. ఆమదమరాళగమనలను హెచ్చరించినాడు. ఓ కొమ్మలాల ! గయ్యాళులాల ! కులుకక నడవండి. మాచిన్నితల్లి మేను కదలీని, పయ్యెద చెరగు జారీని, భారపుగుబ్బలు బయటపడినవి. నుదురు చెమరించినది.'
మదవతులు ముందుకు కదలినారు. ఆ గజగమనలకు గమనవిలాసాలు తప్పలేదు. పల్లకీ కుదింపులూ తగ్గలేదు. అన్నమయ్య వాళ్ళను నిలిపినాడు. మృదువుగా మందలించినాడు. 'ఓ ముద్దుగుమంలాలారా ! కొంచెం నెమ్మదిగా నడవండే. అటు చూడండి నా బంగారుతల్లి పాపటలో చల్లిన గందవొడి శరీరమంతా జారినది. ధరించిన ముద్దుల ముత్యాల కుచ్చులదరినవి. కంకణాలు కదలి కిసలయపాణి ఎంత కందిపోయిందో ! - ఆ భామలు ముసిముసి నగవులతో ముందుకు సాగినారు. ఈ కన్యాదాత ఆరాటం చెప్పనలవి కాదు. ఇందిరా సుందరాంగికి ముత్యాల పావుకోళ్ళు పెట్టరో ! రమణికి మణుల నారతులెత్తరో - అని చెలికత్తెలను పురమాయించినాడు.
అలమేలుమంగా శ్రీనివాసుల కళ్యాణం అంగరంగవైభవముగా జరిపించినాడు. శేషగిరీశ్వరుని కాళ్ళు కడిగి, కన్యాదానం చేసినాడు. వేంకటశైలవల్లభుడు మంగమ్మను బిగికౌగిట చేర్చినాడు. ఈ మహాభక్తుని కన్నులు ఆనందంతో ఆర్ద్రమయినవి.
కొమ్మ = స్త్రీ
జాజులు = జాజి పూలు
గయ్యాళి = ధిక్కరించి మాట్లాడే స్వభావం గల స్త్రీ
శ్రీపాదతాకు కాంతలు = లక్ష్మీదేవి పాదాలు తాకే అధికారం గల ఆడవాళ్ళు, పాదదాసీలు
గందవొడి = గందపొడి ; కొన్ని సుగంధద్రవ్యాలు కలిపి చేసిన పొడి, మిశ్రము, స్త్రీలు దీనిని పాపటలో చల్లుకొంటారు
జమళి = జంట
చమ్మాళిగలు = సమ్మాళిగలు, పాదరక్షలు
2 comments:
శోభారాజు గారు మొదట విడుదల చేసిన కాసెట్లో నాకు బాగా నచ్చిన కీర్తన ఇది సుజాత గారు! శాస్త్రీయ సంగీత పోకడ ఇందులో ఎక్కువగా ధ్వనిస్తుంది.
ఎన్నోరోజులకు విన్నాను, పైగా వ్యాఖ్యానం చదువుతూ!(నా దగ్గరుంది కానీ బయటికి తీయాలంటే బద్ధకం, తీరిక లేకపోవడం మొదలైన వెధవ కారణాలు(సాకులు) ఉన్నాయి)మనసంతా ఆహ్లాదంగా అయిపోయింది. చాలా థాంక్స్ మీకు!ఐ లవ్ యూ!
మీ వ్యాఖ్యానం చాలా బావుంది.
Post a Comment