Wednesday 17 March 2010

తెర తీయగరాదా

తెర తీయగరాదా లోని
తిరుపతి వెంకటరమణ! మచ్చరమను

పరమపురుష ! ధర్మాదిమోక్షముల
పారదోలుచున్నది నాలోని

ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులు రీతి యున్నది
హరిధ్యానము సేయు వేళ చిత్తము
అంత్యజు వాడకుబోయిన ట్లున్నది

మత్స్యము ఆకలిగొని గాలముచే
మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధి మరు
గిడ బడి చెఱచిన ట్లున్నది

వాగురయని తెలియక మృగగణములు
వచ్చి తగులు రీతి యున్నది
వేగమె నీ మతము ననుసరించిన
త్యాగరాజనుత మదమత్సరమను

భావము :

ఓ తిరుపతి వెంకటరమణా ! నాలో ఉండే మాత్సర్యమనే తెర - నీ దర్శనానికి ఆటంకం కలిగిసూంది. దీన్ని తొలగించు. ఓ పరమపురుషా ! ధర్మ, అర్ధ, కామ, మోక్షాలను స్వానుభవానికి రానీకుండా నాలోని ఈ మాత్సర్యమనే తెర - దూరం చేస్తూంది. స్వామీ ! స్థిమితంగా భోజనం చేసే సమయంలో నోటిలో ఈగ అడ్డం వచ్చినట్లూ, స్థిరచిత్తంలో శ్రీహరిని ధ్యానించే వేళలో మనస్సు అనాచార అసభ్య స్థలాలకు వెళ్ళినట్లూ, నీటిలోని చేప ఆకలితో ఆహారంగా అనుకొని గాలానికి తగులుకొన్నట్లూ, స్వచ్చమైన దీపకాంతిలో ఏదో మరుగు ఏర్పడి, కాంతిని చెరచినట్లూ, లేళ్ళు తమను పట్టుకోవడానికి వల పన్నిన గోయి అని తెలియక అందులో పడినట్లూ, ఏ జన్మలోనిదో అయిన మదమాత్సర్యాల తెర నీ దర్శనభాగ్యానికి అడ్డుగా నిల్చి ఉంది. దయతో ఈ తెరను తొలగించి నీ దివ్య దర్శన భాగ్యాన్ని కల్గించవా ?

0 comments:

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger