విశ్వప్రకాశునకు వెలి యేడ లో నేడ
శాశ్వతున కూహింప జన్మ మిక నేడ
సర్వపరిపూర్ణునకు సంసార మిక నేడ
నిర్వాణమూర్తికిని నిలయ మిక నేడ
వుర్వీధరునకు కాలూద నొకచో టేడ
పార్వతీస్తుత్యునకు భావ మిక నేడ
నానాప్రభావునకు నడు మేడ మొద లేడ
ఆననసహస్రునకు నవ్వ లివ లేడ
మౌని హృదయస్థునకు మాటేడ పలు కేడ
జ్ఞానస్వరూపునకు కాన విన నేడ
పరమయోగీంద్రునకు పరు లేడ తా నేడ
దురితదూరునకు సంస్తుతి నింద లేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహ మేడ
హరికి నారాయణున కవుగాము లేడ
భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, జీవుల కర్మఫలప్రదాత. ఇదే సత్యం. మన కర్మలే మనందరి సుఖదుఃఖాలకు కారణం. భగవంతుడు సాక్షీభూతుడు. హరికధాకాలక్షేపం, పురాణశ్రవణం లాంటివాటి ముఖ్యోద్దేశ్యం నామస్మరణే ! ఈ విశ్వాన్నే ప్రకాశింపజేసి, శాసించి, నశింపజేయగల వేకటేశ్వరుడికి, యోగీశ్వరునికి, జ్ఞానేశ్వరునికి, అనంత ప్రభావశాలికి అన్నమయ్య వినిపిస్తున్న కీర్తన ఇది.
From : Saptagiri Magaine Oct 2014