ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు. //2//
1.అంత నింత గొల్లెతల అరచేతి మాణికము - పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస - చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు. -- ముద్దు --
2. రతికేళి రుక్మిణికి రగుమోవి పగడము - మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైఢూర్యము - గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు -- ముద్దు --
3. కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము - యేలేటి శ్రీవేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము - బాలుని వలే దిరిగీ బద్మనాధుడు --ముద్దు --
భావము :
రత్నాల గుణాలన్నీ రాశిపోసి రాజీవాక్షుని అన్నమయ్య అనంతభావనాబలంతో ఉల్లేఖించిన పాట ఇది.
కృష్ణుడు దేవకీదేవి కన్న బిడ్డే కాదు. యశోద కన్న బిడ్డ కూడా. గోపాలుడు ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డడు. అందుకే ఒకరికి ముంగిట ముత్యమై, మరోకరికి తిద్దరాని మహిమల వాడైనాడు.
కృష్ణుడు - గొల్లభామలకు అరచేతి మాణిక్యము. అందరికీ అందుబాటులో ఉండేవాడు. కంసునిపాలిటి వజ్రము - దుష్ట శికషకుడు. గరుడుని ఎక్కి సకలలోకాలు సంచరించే సర్వాంతర్యామి - గరుడ పచ్చ పూస.
మాచెంతలో మాలోనే ఉన్నవాడు చిన్ని కృష్ణుడు. ముఖానికి మోవి ప్రధానం ; ఇది రతికేళి విషయం. అందుకే రుక్మిణికి రంగుమోవి పగడమైనాడు. గోవర్ధనగిరి జగద్రక్షకుడు. జగత్పతి గోమేధికం కావడంలో ఆస్చర్యం లేదు. ఇరు కేల శంఖ చక్రాలు ధరించినాడు ; వాని మధ్య వైఢూర్య కాంతులతో ప్రకాశించే దేవుడు వైడూర్యమే. తన కరుణాకటాక్షాలతో సకల ప్రాణికోటిని కాపడే స్వామి కమలాక్షుడే.
కాళింగుని పడగలపై చిందులు త్రొక్కిన చతుర నటమూర్తి పుష్యరాగమే. శ్రీవేంకటాద్రి వెలసిన వేంకటేశ్వరుడు ఘనశ్యాముడు ఇంద్రనీలం కాక మరేమి ? పాలకడలి లో పవ్వళించిన శేషశాయి రత్నమే ; రత్నాకరంలో పుట్టని దివ్య రత్నం. బ్రహ్మదేవుని కన్నతండ్రి పద్మనాభుడు బాలుని వలే పారాడినాడు.
తిద్దరాని మహిమలు = వంకపెట్టడానికి వీలులేని మహిమలు
ఇరుకేల = ఇరు చేతుల్లోనూ
ఏలేటి శ్రీవేంకటాద్రి = శ్రీవేంకశైలంలో నిలచి సకలచరాచర సృష్టిని ఏలేటివాడు - శ్రీవేంకటేశ్వరుడే.
ఈ పాటలో ఉన్న నవరత్నాల ప్రసక్తి - ముత్యం, వజ్రం, పగడం, గోమేధికం, వైడూర్యం, పుష్యరాగం, ఇంద్రనీలం, మాణిక్యం (పద్మరాగం/కెంపు), గరుడపచ్చపూస (మరకతం).
Listen to the song here.
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
7 comments:
పొద్దున్నే ఈ కీర్తన విన్నాను... Coincidence!!
తిద్దరాని అంటే ఏమిటా అని అడుగుదామనుకున్నాను, మీరే చెప్పేశారు :)
మీ బ్లాగు వైభవం నాకు ఆత్మతృప్తిని కలిగిస్తున్నది. ఫ్రాపంచిక విషయాలను ఎదుర్కొనే మనోస్తైర్యాన్ని అందిస్తున్నది. చూపుని చైతన్య పరుస్తున్నది. నానావిధముల ఆలోచనలు అద్బుతవర్ణలను చదువుతుంటే నా మనసు మూగ బోయి ప్రశాంతత చేకూరుతున్నది. చాలా బావుంది. శ్రీనివాసు గారు మీకు మనస్పూర్తిగా అబినందనలు. ఈ అమృతచినుకులు చాలా మందిని తడిపేయాలని ఆసిస్తున్నాను.
మి ప్రియమైన పృథ్వీ.
సుజాత గారూ"ముద్దుగారే యశోద" కీర్తనని ముద్దులు మూటగట్టేలా వర్ణించారు.మీ వాఖ్యానం బాగుంది.పాట కూడా బాగుంది.కాని పాట నింటున్నపుడు మీ బ్లాగు నుంచి esnips లోకి వెళ్ళిపోతున్నాం.అలా కాకుండా మీ బ్లాగులో వుంటూనే చదువుతూ నినాలని కోరిక.అలా వీలవుతుందన్నారుగా.మరి కావటం లేదే.సందేహాన్ని వీలైతే తీర్చగలరు.
వర్మ గారు మిమ్మల్ని శ్రీనివాసునిగా తలుస్తున్నట్టున్నారు.ఆయనికి మీరు సుజాత గారని, అదే గడ్డిపూల సుజాత గారని(క్షమించాలి-మీ బ్లాగుపేరునే యింటిపేరుగా చేసినందుకు).
సుజాత గారు,
చాలా మంచి కీర్తన .. మీకో విషయం. గత సంవత్సరం బ్లాగు మిత్రులనుండి నాకు ఈ నవరత్నమాల బహుమతిగా వచ్చింది,కూడలికబుర్లలో. ఎంత అమూల్యమైన బహుమతి కదా..
ఆర్.ఎస్.జీ గారు - మీ డిస్ప్లే ఇమేజ్ చాలా బావుంది. :D
పృధ్వీ గారు - నేను ఇది ఒరిజినల్ గా రాయలేదు. నాకెంతో నచ్చిన ఒక పుస్తకం(TTD Publications) నుంచీ (భావాలు మాత్రం) తీసుకుంటున్నాను. నా పేరు సుజాత.
నరసింహ గారు, ఈ విషయయం లో నేను ఎవరినైనా సలహా అడగాలి. నాకు తెలియట్లేదు. జ్యోతి గారినే అడిగాను. ఒకట్రెండు రోజుల్లో దీన్ని పరిష్కరించ వచ్చు అనుకుంటున్నాను.
జ్యోతి gaaru - కంగ్రాట్స్ మరి ! ఈ సంవత్సరం ఏమి గిఫ్ట్ కావాలి ? :D
Sujata గారు మంచి కీర్తనని గుర్తు చేసారండీ. కాని తిద్దరాని కరెక్టేనా...నేను దిద్దరాని మహిమల అనుకుంటున్నాను ఇప్పటి వరకూ, ఒక్క సరి మళ్ళీ చూసి చెప్ప గలరా...
పాటను బాగా వర్ణించారు .. వినటానికి లంకె ఇచ్చారు .. మరి, download కి కూడా permission ఇచ్చుంటే, బావుండేది. Just a suggestion.
Thanks for this wonderful song !!
Post a Comment