Thursday, 4 September 2008

పలుకు తేనెల తల్లి

పలుకు తేనెల తల్లి పవళించెను ! కలికితనముల విభుని గలసినది గాన

1. నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర పగలైనదాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారిన దాక జగదేకపతిమనసు జట్టిగొనెగాన

2. కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగదరుణి బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలక అంగజ గురునితోడ నలసినదిగాన

3. మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున దరుణి పవళించెను
తిరువేంకటాచలాధిపుని కౌగిటన్ గలసి ! అరవిరై నును జెమట నంటినది గాన

భావము :

దివ్య శృంగారం అమలినమైనది. అందుకే 'తల్లి ' శయన లీలలను భక్తుడు తడబాటు లేక వర్ణించినాడు. అలమేలుమంగ తాళ్ళపాక వారి ఇంటి ఆడపడుచు. తన చినారి తల్లి - కలిమిలేమ - ఎక్కడ కందిపోవునో అని ఆ 'అపుకు తేనెల తల్లి ' పవ్వళించుటకు సంకీర్తనాచార్యుడు బంగారుమేడ లో శయనమందిరమును సృష్టించి, ముత్యాల పానుపు అమర్చినాడు.

అలమేలు మంగ పగలైనదాక పవ్వళించినది. సఖులు మంగమ్మ శయనమందిరం చేరి, ముసి ముసి నగవులతో గుసగుసలాడినారు.

పలుకుతేనెల తల్లి కలికితనములతో విభుని మెప్పించి, కలసి, పవ్వళించినది.

చెలి పగలైనదాక పవ్వళించినది. ఆమె నిగనిగలాడు మోమున కిరువైపుల వినీలకుంతలములు చెదరినవి. జగదేకపతి మనస్సును తన జవ్వనముచే జన్నెవట్టి కొన్నది. కలిమికాంతకు స్వాధీనము కానిదేమున్నది ? రేయి సరసములు తెల్లవారు వరకు సాగినవి. అందుకే పగలైనప్పటికీ పడక వదలలేదు.

తరుణి బంగారుమేడపై పవ్వళించినది. కొంగు జారినది. చనుగుబ్బల మెరుగులు వ్యాపించినవి. రాత్రి ఆమె శ్రీనివాసునితో కలసి, అలసినది. వాడు 'అంగజగురుడు '. ఇంక చెప్పవలసిన దేమున్నది ? రాత్రంతా ఆమెకు నిదురపోవు అవకాశమెక్కడిది ? ఆమె కనుగొనలు ఎర్రవారినవి. అవి చెంగులువ కనుగొనల తొలకిన సింగారములు.

వనితమురిపాల నటనతో, పారవశ్యముతో ముత్యాలపానుపుపై పవ్వళించినది. ఆమె తారుణ్యలావణ్యములు పరచినట్లున్నవి. వేంకటేశ్వరుని బిగికౌగిలినలుగుటవలన ఆమె మేన చిరుచెమట వ్యాపించినది. సగము విచ్చిన పూవు వలె అలమేలుమంగ పవ్వళించినది.


కలికితనములన్ = నేర్పరితనం చేత

నెఱులు = వెంట్రుకలు

కెలకులను = ఇరుప్రక్కలందు

పరిణతులతో = ముగింపులతో

జట్టిగొనెన్ = వెలకు కొనును

అంగజగురుని తోడ = మన్మధుని తండ్రి అయిన వేంకటేశ్వరునితో

మురిపెము = మురియు భావార్ధమం

మలగు = శయ్య

అరవిరి = సగము విచ్చిన పూవు


కీర్తన వినండి

4 comments:

సుజాత వేల్పూరి said...

ఇది జానకి పాడిన కీర్తన విన్నారా! ఆలిండియా రేడియో విజయవాడ వాళ్ల దగ్గరుంది. అది విన్నాక చచ్చిపోయినా పర్లేదనిపిస్తుంది నాకు! అంత మధురంగా ఎలా పాడగలిగిందో జానకి నాకర్థం కాలేదు. శైలజ చాలా డ్రై గా పాడింది. పరుచూరి శ్రీనివాస్ గారిని అడగాలి జానకి కీర్తన వుందేమో!

కొత్త పాళీ said...

You can read another detailed interpretation here.
http://telpoettrans.blogspot.com/2007/07/blog-post.html

Song was tuned by Nedunuri Krishnamurthi garu.

Sujata M said...

Sujata garu

చాలా రోజుల క్రితం విన్నాను. చాలా నచ్చింది. ఇపుడు దొరకలేదు. వెతకాలి.

చాల థాంక్స్.

Sujata M said...

కొత్త పాళీ గారు ..

చాలా బావుంది మీ బ్లాగ్. మంచిగా వివరించారు. మీ బ్లాగ్ ను ఇంతవరకూ నేను చూడనే లేదు. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger