తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
ఎప్పుడు లోకములెల్ల నేలేటి వాడు
మోత నీటి మడుగులో ఈత గఱిచినవాడు
పాతగిలే నూతి క్రింద బాయనివాడు
మూతి దోసిపట్టి మంటి ముద్ద పెల్లగించువాడు
రోతయైన పేగుల పేరులు గలవాడు
కోడికూతనోరివాని కుఱ్రతమ్ముడైనవాడు
బూడిదిబూసినవాని బుద్ధులవాడు
మూడవన్నె లేడివెంట మాయలబడినవాడు
దూదలనావులగాచి దొరయైనవాడు
ఆకసాన బారే వూరి అతివలమానముల
కాకుసేయువాడు తురగముపై వాడు
ఏకమై వెంకటగిరి నిందిరారమణిగూడి
యేకాలము బాయని యెనలేనివాడు
భావము : -
మోతనీటి మడుగు = ఘోషించు నీరు గల సముద్రము (మత్స్య)
పాతగిలే = ప్రాచీనుడయియే
నూతి క్రింద = సముద్రము నడుగున (అతనిపాలికి సముద్రము మడుగు నూయి వంటిది) - (కూర్మ)
తోసిపట్టి = చాచిపట్టుకుని (వరాహ)
పేగుల పేరులు = హిరణ్యకశిపునివి (నృసింహ)
కోడి..వాడు = అహల్యను పొందుటకై అర్ధరాత్ర మందే కోడియై కూసిన ఇందృని తమ్ముడు ఉపేందృడు (వామన)
బూడిది .. వాడు = విభూతి దాల్చిన పరమశివుని వద్ద అస్త్రవిద్యలు నేర్చినవాడు (పరుశరామ)
మాడవన్నె = బంగారు వన్నె గల
లేడి ... వాడు = మారీచునిచే వంచితుడు (రామ)
దూడల ... వాడు = బలరామకృష్ణులలో ఎవరైనా గావచ్చును
ఆకసాన .. వాడు = త్రిపురముల రాణుల నడతను చెఱచిన వాడు (బుద్ధ)
తురగముపైవాడు = కల్కిగా నవతరించి గుఱ్రముమీద స్వారీ చేయువాడు (కల్కి)
భావము చెప్పినది : శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
(సృష్టికి పూర్వము ఏకోదకములో వటపత్రశాయిగానున్న విష్ణుని దశావతారముల ఉల్లేఖము పద వస్తువు)
దర్మానికి గ్లాని కలిగినప్పుద్డు లోకపాలకుడైన భగవంతుడు అవతారాలెత్తక తప్పదు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించుటయే వేంకటేశ్వరుని కర్తవ్యము. శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత లో ఇట్లు చెప్పెను.
యదా యదాహి దర్మస్య గ్లాని ర్బవతి భారత ! అభ్యుత్ధాన మధర్మస్య తదా త్మానం సృజామ్యహం [ భగవత్గీత 4 అధ్యా 7 శ్లో ]
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ! ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే [ భగవత్గీత 4 అధ్యా 8 శ్లో ]
సోమకాసురుడు వేదాలను అపహరించి, ధర్మచ్యుతి కి కారకుడైనాడు. సముద్రమున గాగిన ఆ రాక్షసుని విష్ణువు మత్స్యాకృతి దాల్చి సమ్హరించినాడు. వేదోద్ధరణము చేసినాడు.
క్షీర సాగర మధనము ప్రారంభమైనది. మందర పర్వతము మునగసాగినది. శ్రీ మహా విష్ణువు ఆదికూర్మమై దానిని మోసి నిలిపినాడు.
భూమిని చాపచుట్టగ చేసి ప్రజలను బాధించిన హిరణ్యాక్షుని వరాహావతారముని ధరింది సంహరించినవాడు; భూమిని కోరలతో పట్టి ఎత్తినాడు.
నృసింహాకృతి పూని లోక కంటకుడైన హిరణ్యకశిపుని పొత్త చీల్చి ప్రేగులను హారములుగ వేసికొన్నాడు.
వామన రూపుడై మూడడుగుల దాన మడిగి, త్రివిక్రముడై బలిని పాతాళమునకు త్రొక్కి, ఇంద్రునకు స్వర్గము నప్పగించినాడు.
ధరలో క్షత్రియుల ఔద్దత్యము మితిమీరినది. హరి పరశురాముడైనాడు. శివుని కడ అస్త్ర విద్యల నభ్యసించినాడు. ఇరువది యొక్క మారులు భూప్రదిక్షణము చేసి, దుష్టులైన క్షత్రియవీరులను నిర్జించినాడు.
మాయా మృగాకృతి తో మారీచుడు శ్రీ రాముని వంచించినాడు ; సీతాపహరణమునకు కారకుడైనాడు. రాముడు ఆ మాయావిని నేలకూల్చినాడు.
గొల్లపల్లెలో, గోవులతో, గోపాలురతో ఆడుతూ, పాడుతూ తిరిగిన నంద కిశోరుడు యాదవకుల ప్రభువైనాడు. పరమాత్ముడైనాడు.
త్రిపురముల గర్వముతో కన్ను మిన్ను కానక తిరిగిన త్రిపురాసుర సంహారమునకు హరి దోహదము చేసినాడు. బుద్ధుడై రాక్షసుల రాణుల శీలము నపహరించినాడు.
ఇక, కల్కిగా అవతరించి, ధర్మ రక్షణ చేసేవాడు, గుఱ్రముమీద స్వారీ చేసేవాడు శ్రీమన్నారాయణుడే.
ఇవి వేంకటగిరినిలయుని అవతార లీలలు. ఆ ఇందిరారమణుడు సాటిలేనివాడు. సర్వకాల సర్వావస్థల యందు ప్రాణికోటిని అనుగ్రహించుటకై శేషగిరి శిఖరముల నిలచినాడు.
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
4 months ago
0 comments:
Post a Comment