Sunday, 20 August 2017

చరణములే నమ్మితి




చరణములే నమ్మితి - నీ దివ్య చరణములే నమ్మితి
వారధి గట్టిన - వరభద్రాచల - వరదా వరదా వరదా వరదా - నీ దివ్య ||


వనమున ఱాతిని వనితగ జేయు నీ
చరణము శరణము శరణము నీ దివ్య ||

ఆదిదేవ నన్నఱమర సేయకు
మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య  ||

పాదారవిందమే - యాధారమని వర
పడితిని పడితిని పడితిని నీ దివ్య ||

వెయ్యాఱువిధముల - కుయ్యాలించి వే రా
వయ్యా అయ్యా నీ దివ్య ||

బాగుగ నన్నేలు - భద్రాచలరామ
దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య ||

వాసిగ నన్నేలు వరభద్రాచల
వరదా వరదా వరదా నీ దివ్య ||


పాహిమాం శ్రీరామా





పాహిమాం శ్రీరామా యంటే పలుకవైతివీ - నీ
స్నేహమెట్టిదని చెప్ప- నో హో హో హో  హో హో హో హో


ఇబ్బంది నొంది యాకరి - బొబ్బ వెట్టినంతలోనె
గొబ్బున గాచితివని - జబ్బుసేయక
నిబ్బరముగా నేనెంతో - కబ్బమిచ్చి వేడుకొన్న
తబ్బిబ్బుచేసెదవు రామ - అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ || పాహి ||


సన్నుతించువారినేల్ల - మును దయతో బ్రోచితివని
పన్నగశాయి నే విని విన్నవించితివి
విన్నపము వినకయెంతో- కన్నడసేసెదవు రామ
యెన్నటికి నమ్మరాదు - రన్నన్నన్నన్నన్నన్నన్న  || పాహి ||


చయ్యన భద్రాచలనిలయస్వామివని నమ్మి నేను 
వెయ్యాఱు విధముల నుతి-చెయ్యసాగితి
ఇయ్యెడను రామదాసుని -కుయ్యాలించి ప్రోవకున్న నీ
యెయ్యూర మేమనవచ్చు - నయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో  || పాహి ||


Tuesday, 15 August 2017

ఇక్ష్వాకు కుల తిలక

ఇక్ష్వాకు కుల తిలక యికనైనా బలుకవె రామచంద్రా - నన్ను
రక్షింపు మింక నోరఘుకులతిలక - శ్రీ రామచంద్రా ||  ||ఇక్ష్వాకు ||

                                              1

చుట్టు ప్రాక్రారములు సొంపుతో గట్టిస్తి - రామచంద్రా - ఆ 
ప్రాక్రారానికి బట్టె పదివేల వరహాలు రామచంద్రా ||  ||ఇక్ష్వాకు ||
                                             
                                             2

గోపురమంటపాల్ కుదురుగ గట్టిస్తి-రామచంద్రా- నన్ను
గ్రొత్తగజూడక యిత్తఱి బ్రోవుము - రామచంద్రా || ||ఇక్ష్వాకు ||

                                            3

భరతునకు జేయిస్తి పచ్చల పతకము రామచంద్రా ||
పతకానికిబట్టె పదివేలవరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||

                                            4

శత్రుఘ్నునకు నేను జేయిస్తి మొలత్రాడు రామచంద్రా ||
మొలత్రాటికి బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ||  ||ఇక్ష్వాకు ||
                                          
                                           5

లక్ష్మణునకు వేస్తి ముత్యాల పతకము రామచంద్రా - ఆ
పతకానికిబట్టె పదివేల వరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||

                                           6

సీతకు జేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఆ
పతకానికి బట్టె పదివేల వరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||

                                          7

వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా - జగ
న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||

                                           8

కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
కులుకుచు దిరిగెద-వెవరబ్బ సొమ్మని రామచంద్రా || ||ఇక్ష్వాకు ||

                                           9

మీ తండ్రి దశరథ మహారాజు పెట్టేనా రామచంద్రా లేక -
మీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్రా || ||ఇక్ష్వాకు ||

                                         10

అబ్బ తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా - ఈ -
దెబ్బల కోర్వక అబ్బ తిట్టితి నయ్య రామచంద్రా || ||ఇక్ష్వాకు ||

                                        11

ఏటికిజల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా - నేను
అధమునికంటెను అన్యాయమైతిని రామచంద్రా || ||ఇక్ష్వాకు ||

                                        12

సర్కారు పైకము తృణముగ నెంచుమీ రామచంద్రా ఈ
దెప్పరమున గాచి యప్పుదీర్చుమయ్య రామచంద్రా ||   ||ఇక్ష్వాకు ||

                                         13

కౌసల్యాపుత్రక దశరథతనయ శ్రీరామచంద్రా - కావు
క్షేమమున భద్రాద్రిలో నెలకొన్న - శ్రీరామచంద్రా ||  ||ఇక్ష్వాకు ||

                                        14

భక్తులందఱిని బరిపాలించెడి రామచంద్రా - నీవు
క్షేమముగ శ్రీ రామదాసుని నేలుము రామ                 ||ఇక్ష్వాకు ||

                                           * * *

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger