Saturday, 30 August 2008

సువ్వి సువ్వి

సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెద రోలాల

1. వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోరాలాల
కనుచూపులనిడు రోకండ్లను కన్నెలు దంచెద రోలాల

2. బంగరు చెఱగుల పట్టు పుట్టములు కొంగులు దూలగ నోలాల
అంగనలందరు నతివేడుకతో సంగడి దంచెద రోలాల

3. కురులు దూలగ మచి గుబ్బచనులపై సరులు దూలాడగ నోలాల
అరవిరి బాగుల నతివలు ముద్దులు గురియుచు దంచెద రోఅలాల

4. ఘల్లు ఘల్లుమను కంకణరవముల పల్లవపాణుల నోలాల
అల్లన నడుములు అసియాడుచు సతు లొల్లనె దంచెద రోలాల

5. కప్పురగంధులు కమ్మనిపువ్వుల చప్పరములలో నోలాల
తెప్పలుగా రతి దేలుచు గోనే టప్పనిబాడెద రోలాల


భావము :

కన్నెలు తమజవ్వ్వనమునే వేంకటేశ్వరునకు కప్పముగా చెల్లించినారు. హరిస్మరణ ఆ హరిణేక్షణల దైనందిన జీవితమైనది. పాలు పిదికినా, పెరుగు చిలికినా, బియ్యము దంచినా, చెరగినా - కోనేటప్పని గురించి పాడుటే వారికి పరిపాటైనది.

ఇది దంపుళ్ళ పాట. శ్రీనివాస కళ్యాణమునకు తలంబ్రాలు తయారు చేయుచున్నారు కాబోలు. యౌవనవతులు సింగారములు ఒలకబోయుచు దంపుళ్ళను ప్రారంభించినారు. ఈ టపాలో అన్నమయ్య మాటలమల్లె పందిళ్ళు కప్పినాడు. శబ్ధాలతో వర్ణచిత్రాలు గీచినాడు.

వనితలు 'సువ్వి ' , 'సువ్వి ' అనే ఊర్పులతో పని ప్రారంబించినారు. పాట మొదలు పెట్టినారు. కన్నెలు తమ మనసులనే కుదురులుగా నిలిపినారు. కనుచూపులనే రోకండ్లతో దంపుళ్ళు సాగించినారు. అంతా పాకములో పడినపుడు కోనేటప్పను తమ కొంగులలో ముడివేసుకొనవచ్చు నని తలపు కాబోలు.


దంపుళ్ళు సాగుతూనే ఉన్నవి. అంగనలు బగరుచెరగుల పట్టుచీరలను కట్టినారు. పైటకొంగులు ఊగిసలాడినవి. గుంపులుగ దంపుళ్ళలో తగిలిన మగువల విలాసములు గుంపులు కట్టి వేడుక లొలకబోసినవి.

వారి కురులు వీడినవి. చనుగుబ్బలపై సరులు నాట్యము లాడినవి. అరవిరి సొబగులతో ముద్దుగుమ్మలు ముద్దులు కురిపించినారు.

ఆ పల్లవపాణుల పాణికంకణములు ఘల్లుఘల్లుమనినవి. బరువులు మోయలేక, శ్రమకు తాళలేక ఆ హరిమధ్యల నడుములు అసియాడినవి. అబలలు మెలమెల్లగ దంపుళ్ళను ముగించినారు.



కన్నెల శ్రమ ఫలించినది. ఆ కప్పురగంధుల ఒడలి బడలికలు పూలపందిళ్ళ క్రింద తీరినవి. చలువ చప్పర్ముల క్రింద రతి పారవశ్యముతో కోనేటప్పని పాడుతూ తెప్పల తేలినారు.

కుందెన = కుదురు
సంగడి = గుంపుగా
అరవిరి బాగులన్ = సగము విచ్చిన పూల వంటి నిండు సొబగులతో
ఒల్లన = మెల్లగా
కోనేటప్పని = స్వామి పుష్కరిణీ తీర వాసి యగు శ్రీనివాసుని

0 comments:

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger