విన్నపాలు వినవలె - వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా.
1. తెల్లవారె జామెక్కె - దేవతలు మునులు
అల్లనల్లనంత నింత నదిగో వారే
చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు
మెల్ల మెల్లనె విచ్చి మేలుకొన వేలయ్యా
2. గరుడ కిన్నర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరు నెన్నదివో
సిరి మొగము దెరచి చిత్తగించ వేలయ్యా
3. పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా
భావము :
విన్నపాలు = వేరు వేరు అధికారులు నిత్యమును చేయు సునామణి మాటలు అవి వింత వింతలైనవి.
పన్నగపు దోమతెర = ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువునకు పలువిధములగు భోగోపకరణములుగా సేవ చేయును. అట్లే ఆ పన్నగము - పాము దోమతెరగా గూడ రూపెత్తి సేవించును.
అంతనింతన్ = దూరముగా, దగ్గరగా, పెద్ద చిన్న గుంపులుగా, సారసపు = సరసమే సారసము - రసముతో - ప్రీతితో కూడినది.
గములు = గుంపులు, వింతాలాపాలన్ = క్రొత్త క్రొత్త రాగాలాపములతో,
సిరి మొగము = శ్రీమంతమైన ముఖము
తెరచి = దోమతెర మఱుగు దొలగించి చూపి.
అంకెలన్ = సమీపమున
అలమేలుమంగ = అలర్ మేల్ మంగై - పూవు (తామర) మీది స్త్రీ అను తమిళ పదమునకు తెలుగు వికృతి. తమిళంలో 'మంగై ' అనగా 14 - 18 ఏళ్ళ మధ్య వయసు గల స్త్రీ. నిద్ర మేల్కనిన నీ మొదటి చూపు మంగళ దేవతయైన ఆ పద్మావతీ దేవి మీద ప్రసరించుట జగన్మంగళ హేతు వగును.
ఇది స్వామికి మేలుకొలుపు. ఇది సకల చరాచర సృష్టికే మేలుకొలుపు. మనకే కాదు - భగవంతునికి కూడ దోమతెర కట్టుకొనుట తప్పలేదు. ఆది శేషుడున్నంతవరకు స్వామికి ఏ కొరత లేదు. అవతారములెత్తుటలో శేషుడు తన ప్రభువునకు ఏమీ తీసిపోవువాడు కాదు. 'ఆది శేశుడు శ్రీ మహావిష్ణువునకు పలు విధములగు భోగోప కరణములుగా సేవ చేయు ' నని యమునాచార్యులవారు ఆనతిచ్చినారు. వారు 'వారణాదిభిః ' అనుట మేలైనది. అన్నమయ్య పన్నగమును దోమతెరగ కూడ భావించినాడు. అతనిదొక విలక్షణమైన భావచిత్రణ.
అందరి విన్నపాలు వినవలెనని మేలుకొను మని అన్నమయ్య తన విన్నపాలనే స్వామికి తొలుత వినిపించినాడు. భక్త పరాధీనుడైన భగవంతునకు వినక తప్పలేదు.
అదిగో - తెల తెలవారినది. ప్రొద్దు జామెక్కినది. ముక్కోటి దేవతలు, మునులు - అరుగో అంతలంతల నిలచినారు. మెల్ల మెల్లగా నీ కన్నుందామరలు విచ్చి చల్లని చూపులు వారిపై చల్లవయ్యా !
అవిగో - క్రొత్త క్రొత్త రాగాలాపనలు నీకు వినిపించుట లేదా ? అవి గుంపులు గుంపులుగ నీ యొద్ద చరిన గరుడ కిన్నెర యక్ష కామినుల విరహ గీతములు. నీ ప్రణయ దృక్కులతో వారి కోరికలు తీర్చుము. దోమతెర తోల్గించి, సిరులు చిందే నీ ముఖమును చూపుము. ఆ హరిణేక్షణల చిత్తములను తెలిపే పాటలను చిత్తగించవయ్యా !
అరుగో (దోమ తెర యైన) శేషుడు, తుంబురు నారదాదులు. బ్రహ్మ - అందరు నీ పాదాల సన్నిధిలోనే నిలచి యున్నారు. తొంగలి రెప్పలు విచ్చి నీ తొలి చూపు కలిమికలికిపై నిలుపవయ్య ! జగన్మంగళ - అలమేలుమంగను చూడవయ్యా !
ఈ వింత వింత విన్నపములు విని సిరిమగడు ముసి ముసి నగవులతో నిద్ర లేచియే ఉండును.
(శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ మరియు శ్రీ కామిశెట్టి శ్రీనివాసు గార్ల వివరణ)